ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 పోస్టులకు తుది గట్టానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పూర్తికాగా.. తాజాగా ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఇటీవల విడుదలైన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో 1:2 నిష్పత్తిలో ఇంటర్య్వూకి అభ్యర్ధులను ఎంపిక చేశారు. ఈ ప్రకారంగా మొత్తం 182 మంది ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. వీరందరికీ జూన్ 23 నుంచి జులై 15వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సంబంధిత ఇంటర్వ్యూ తేదీలను కమిషన్ అధికారిక వెబ్‌సైట్లో పొందుపరిచింది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు జూన్ 10న విడుదలయ్యాయి. మే 3 నుంచి 9 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 4,497 మంది అభ్యర్థులు హాజరయ్యారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం పట్టణాల్లోని మొత్తం 13 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఏపీపీఎస్సీ త్వరతగతిన మూల్యాంకనం పూర్తి చేసి పరీక్షలు పూర్తైన కేవలం నెల రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసింది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే రోజునే అభ్యర్ధులకు ఏపీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్ధులు ముందుగానే అవసరమైన అన్ని సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవల్సి ఉంటుంది. ఇక స్పోర్ట్స్ క్యాటగిరీలో ఎంపికైన 42 మంది అభ్యర్థులకు జూన్ 17న ఏపీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసినట్లు కమిషన్ కార్యదర్శి తెలిపారు.
కాగా ఏపీపీఎస్సీ మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 2023 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తుది దశ అయిన ఇంటర్యూ అనంతరం అభ్యర్ధుల మార్కులతో కూడిన ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను కమిషన్ విడుదల చేస్తుంది. అనంతరం ఎంపికైన వారందరికీ నియామక పత్రాలు అందజేయడం జరగుతుంది.