ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ నిరుద్యోగ యువతకు తీపికబురు చెప్పింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. ఇప్పటికే 16 వేలకుపైగా ఉపాధ్యాయ కొలువుల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటన జారీ కాగా, ఏపీపీఎస్సీ కూడా పెండింగ్‌లో ఉన్న పలు ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు రంగం సిద్ధం చేసింది.
నిజానికి, ఈ ఉద్యోగాల భర్తీకి గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ ఎస్సీ వర్గీకరణ అంశం పెండింగ్‌లో ఉండటం వల్ల జాప్యం నెలకొంది. తాజాగా ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా శాఖల వారీగా రోస్టర్ పాయింట్ల ఖరారు చేయడంతో ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో దాదాపు 866 పోస్టుల భర్తీకి సంబంధించి 18 నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. వాటిలో అత్యధికంగా అటవీ శాఖలోనే 814 పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు ఖాళీల వివరాలు ఆయా ప్రభుత్వ శాఖలు పంపించాయి. వీటికి ఎస్సీ వర్గీకరణకు తగ్గట్లు రోస్టర్ పాయింట్లు ఖరారు చేయడం పూర్తి చేసి నెల రోజుల వ్యవధిలో వెంటవెంటనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీ చేయనుంది.
శాఖల వారీగా ఏపీపీఎస్సీ భర్తీ చేయనున్న ఉద్యోగాలు ఇవే..
- అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ పోస్టులు: 100 (30 పోస్టులు క్యారీ ఫార్వర్డ్)
- బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు: 691 (141 క్యారీ ఫార్వర్డ్)
- డ్రాఫ్ట్స్‌మెన్ గ్రేడ్-2 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు: 13
- తన్నేదార్ పోస్టులు: 10
- వ్యవసాయ శాఖలో అగ్రకల్చర్ ఆఫీసర్ పోస్టులు: 10
- దేవాదాయ శాఖలో జిల్లా సైనిక్ అధికారి పోస్టులు: 7
- జిల్లా సైనిక్ అధికారి పోస్టులు: 7
- గ్రంథ పాలకుడు (ఇంటర్ విద్య) పోస్టులు: 2
- ఉద్యానశాఖలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు: 2
- మత్స్య శాఖలో అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు: 3
- భూగర్భ నీటి పారుదల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు: 4
- మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ- 2, సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ -3, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ – 4 పోస్టులు: 11
- రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు: 1 (క్యారీ ఫార్వర్డ్)