ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు ప్రయాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మహిళలు ప్రయాణించవచ్చో.. కూడా చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని హామీనిచ్చింది. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ సర్కార్ ఈ స్కీమ్‌పై కసరత్తు చేస్తూ వస్తోంది.. మహిళలకు ఉచిత బస్సు పథకాలను అమలు చేస్తోన్న కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఏపీ మంత్రులు, అధికారులు పర్యటించి ఇప్పటికే పూర్తి వివరాలు సేకరించారు.. అంతేకాకుండా.. ఏపీలో కూడా అమలు చేసేందుకు చంద్రబాబు సర్కార్ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది.. వచ్చే నెలలో ఉచిత బస్సు పథకాన్ని క్షేత్ర స్థాయిలో అమల్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలను ప్రారంభించింది.
కాగా.. మంగళవారం శ్రీశైలంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు.. సున్నిపెంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి ఫ్రీ బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు.. ఏ జిల్లాకు చెందిన మహిళలు ఆ జిల్లా వరకే ఉచితంగా ప్రయాణం చేయవచ్చని స్పష్టంచేశారు. జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆడబిడ్డలు ఫ్రీగా ప్రయాణం చేయొచ్చని.. ఒక్కరూపాయి కూడా అవసరం లేదని స్పష్టంచేశారు.