కాకినాడ జిల్లా పెదపూడి మండలం అచ్యుతాపురానికి చెందిన భాస్కరరావు. గత కొన్నేళ్లుగా ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. అయితే.. డీజిల్ ఖర్చు ఎక్కువవుతోందని 3 నెలల కిందట ఈ-ఆటోను కొనుగోలు చేశారు. నెల తిరిగేసరికి దానికీ ఛార్జింగ్ బిల్లు బాగానే వచ్చేది. దీంతో మరి ఖర్చు తగ్గించుకునేందుకు సోలార్ టెక్నీషియన్‌గా పని చేసే మిత్రుడి సాయం కోరారు. అందుకు అతను అంగీకరించడంతో పర్యావరణహితంతో కూడా ఆటోను రూపొందించారు.
ఆటో పైభాగాన సౌరఫలకాలు ఏర్పాటు చేసి, ఎస్-ఆటో (సోలార్ ఆటో) కింద మార్చేశారు. దీనికి రూ.30 వేల ఖర్చయిందని ఆటో డ్రైవర్ తెలిపారు. ప్యానల్ తో ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 8 గంటలపాటు నిరంతరాయంగా ప్రయాణించవచ్చని ఆటో డ్రైవర్ భాస్కరరావు చెబుతున్నారు. ఆటో నిర్వహణఖర్చు సైతం గతంలో కంటే బాగా తగ్గిందని, వర్షాల సమయంలో మాత్రం ఛార్జింగ్ పెడతానని వివరించారు ఆటో డ్రైవర్. కొత్తగా ఆలోచించి, సోలార్ ఆటో తయారు చేయించుకున్న ఆటో డ్రైవర్ భాస్కరరావును పలువురు అభినందిస్తున్నారు.