బైంసాలో పట్టపగలే చోటుచేసుకున్న చోరీ కలకలం రేపింది. అమెరికాలో ఉన్న కూతురు పంపిన రూ.5 లక్షలు బ్యాంక్ నుంచి డ్రా చేసుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తి… తినేందుకు బార్ అండ్ రెస్టారెంట్‌లోకి వెళ్లిన క్షణాల్లోనే స్కూటీ డిక్కీ నుంచి డబ్బులు గల్లంతయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నిర్మల్ జిల్లా బైంసాలో సోమవారం నాడు మధ్యాహ్న సమయంలో చోరీ జరిగింది. ముథోల్ మండలానికి చెందిన ఎడ్‌బిడ్ గ్రామవాసి బొంబోతుల ఆనంద్ అమెరికాలో ఉన్న తన కూతురు పంపిన డబ్బును బ్యాంకు నుంచి డ్రా చేసుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బైంసా పట్టణంలోని యూనియన్ బ్యాంక్ నుంచి ఆనంద్ రూ.5 లక్షలు తీసుకున్నారు. ఆ డబ్బును స్కూటీ డిక్కీలో భద్రపరిచి ఎడ్‌బిడ్‌కు వెళ్లేందుకు బయలుదేరారు. అయితే, మార్గమధ్యలో ఆకలిగా ఉండటంతో బైంసా శివారులో ఉన్న సాయిలక్ష్మీ బార్ అండ రెస్టారెంట్ వద్ద స్కూటీ నిలిపి భోజనం చేయడానికి లోపలికి వెళ్లారు.
ఇంతలో ఇద్దరు అనుమానితులు ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చారు. వారిలో ఒకరు బార్ బయట నిలిపి ఉన్న ఆనంద్ స్కూటీ దగ్గరకు వెళ్లి డిక్కీ ఓపెన్ చేసి, అందులో ఉన్న నగదు అపహరించారు. భోజనం ముగించుకుని బయటకు వచ్చిన ఆనంద్ స్కూటీ దగ్గరకు వచ్చి డిక్కీ ఓపెన్ అయి ఉన్న దృశ్యం చూసి షాక్‌కు గురయ్యారు. పూర్తిగా తనిఖీ చేయగా, డబ్బు మొత్తం గల్లంతైన విషయం తెలిసింది. బాధితుడు వెంటనే బార్ నిర్వాహకులకు విషయం తెలియజేసి, ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. టౌన్ సీఐ గోపినాథ్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.