తెలంగాణలో రాజకీయ పార్టీలకు అసలు సిసలు సంజీవనిగా మారింది బనకచర్ల. కాసేపు ఓ పార్టీకి పాజిటివ్‌గా మారి.. ఆ వెంటనే ఇంకో పార్టీ వైపు బెండవుతూ.. మూడు పార్టీలతో దాగుడుమూతలాడుతోంది బనకచర్ల టాపిక్. ప్రస్తుతానికి బనకచర్లలో ఏ పార్టీది అప్పర్‌హ్యాండ్.. ఏ పార్టీ వెనకబడింది..?
ఇన్నాళ్లూ రెండు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ సెగ రేపింది గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు. అనుమతులు అంత ఈజీగా ఇచ్చేది లేదని డీపీఆర్‌ను కేంద్రప్రభుత్వం తిరుగుటపాలో పంపడంతో ఇంట్రస్టింగ్ టర్న్ తీసుకుంది. మరి.. బనకచర్ల వివాదం టీకప్పులో తుపానుగా మారి చప్పున చల్లారిపోయినట్టేనా? ఇలా అనుకుంటుండగానే… బనకచర్లకు సంబంధించిన రాజకీయ సంవాదం మాత్రం తెలంగాణలో మెగా సీరియల్‌గా సాగుతూనే ఉంది. గోదావరి జలాల్ని ఏపీ ప్రభుత్వానికి అప్పనంగా అప్పగిస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డి చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చింది బీఆర్ఎస్. ఆ విధంగా బనకచర్ల నుంచి పొలిటికల్ మైలేజ్‌ను బాగానే పిండుకుంది గులాబీ పార్టీ. కట్‌చేస్తే.. ఇప్పుడు ఎడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీ. వరసబెట్టి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లిస్తున్న మంత్రులు.. ఇదంతా మీరు గతంలో చేసిన పాపఫలితమేనంటూ ప్రతిఘటన మొదలుపెట్టారు.
కేసీఆర్ రాసిన మరణశాసనమే కారణం అంటూ బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్‌రెడ్డి.. బనకచర్ల సబ్జెక్ట్‌ను తమకు అనువుగా మార్చుకునే ప్రయత్నం చేశారు. దీంతో అనూహ్యంగా కాంగ్రెస్‌కి పాజిటివ్‌గా మారినట్టయింది బనకచర్ల. అటు.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నారని పన్లోపనిగా బీజేపీనీ టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. బనకచర్లపై ఆచితూచి స్పందిస్తూ వచ్చిన కమలం పార్టీ.. తాజా పరిణామాలతో మరింత ఇరుకున పడింది. బీఆర్ఎస్‌తో గాని, కాంగ్రెస్‌తో గానీ తమకు దోస్తీలేదని భుజాలు తడుముకుంటోంది.
సో.. తెలంగాణలో మూడు పార్టీల మధ్య సర్కస్ ఫీట్లను తలపిస్తోంది బనకచర్ల ప్రాజెక్ట్. ఎవరి రాగం వాళ్లు ఆలపిస్తూ బ్లేమ్ గేమ్‌తోనే టైమ్ పాస్ చేస్తున్నారు. అటు బనకచర్లలో అసలు వివాదమే లేదని, తెలంగాణ రాజకీయ పార్టీలకు ఇదొక వస్తువుగా మారుతోందని మొదటినుంచీ చెబుతూ వస్తోంది ఏపీ సర్కార్.
Amaravati News Navyandhra First Digital News Portal