బాసర ఆర్జీయూకేటీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మెరిట్‌ లిస్ట్ చూశారా?

తెలంగాణలోని బాసర, మహబూబ్‌నగర్‌ ఆర్జీయూకేటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు (పీయూసీ ఫస్ట్‌ ఇయర్‌) ప్రవేశాలకు సంబంధించి తొలి జాబితాను బాసర ఆర్జీయూకేటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి గోవర్ధన్‌ శుక్రవారం విడుదల చేశారు. ఆర్జీయూకేటీల్లో ప్రవేశాలకు ఈ ఏడాది దాదాపు 20 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో తొలి విడతలో 1690 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. అయితే ఈ జాబితాలో స్పెషల్‌ కేటగిరీ సీట్లు మినహాయించారు. తొలి జాబితాలో ఎంపికైన విద్యార్థులకు జులై 7, 8, 9 తేదీల్లో బాసర క్యాంపస్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. తొలి విడత విద్యార్థుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

తొలి విడత ఎంపిక జాబితాలో అత్యధికంగా 72శాతం బాలికలు, బాలురు 28 శాతం ఉన్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 88 శాతం మేర సీట్లు సాధించడం గమనార్హం. ఆర్జీయూకేటీ కౌన్సెలింగ్‌ జులై 7న 1వ నంబర్‌ నుంచి 564 వరకు జరుగుతుంది. జులై 8వ తేదీన 565 నుంచి 1128 వరకు, ఇక జులై 9న 1129 నుంచి 1690 నంబర్‌ వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్ధులు తప్పనిసరిగా తమతోపాటు అవసరమైన ఒరిజినల్‌ సర్టిఫికెట్లను తీసుకురావాలి. తొలి విడత జాబితాలోని విద్యార్ధులు ఎవరైనా కౌన్సెలింగ్‌కు హాజరు కాకపోతే ప్రవేశం పొందే అవకాశం కోల్పోతారని వర్సిటీ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇక మొదటి దశ కౌన్సెలింగ్‌ తర్వాత మిగిలిన సీట్లకు వెయిటింగ్‌ లిస్ట్‌ను విడుదల చేస్తారు. బాసర, మహబూబ్‌నగర్‌ ప్రాంగణాల్లో ప్రవేశాలకు మొత్తంగా 19,967 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 19,877 చెల్లినవని అధికారులు వెల్లడించారు. దరఖాస్తుదారుల్లో 19,701 మంది స్థానికులు, 176 మంది స్థానికేతరులు ఉన్నారు. కౌన్సెలింగ్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 7382595661, 8008595661, 9052595661 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. లేదంటే admissions@rgukt.ac.in ఇ-మెయిల్‌ ద్వారా కూడా సందేహాలను నివృతి చేసుకోవచ్చు.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *