కల్తీ నెయ్యి కేసులో అక్రమాలు బట్టయలు.. తిరుమలతోపాటు ప్రసిద్ధ దేవాలయాలకు కల్తీ నెయ్యి సరఫరా!

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై సిట్ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఉత్తరాఖండ్‌కు చెందిన భోలేబాబా డెయిరీ తిరుపతి నగరంలోని ఓ చిన్న డెయిరీని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు కల్తీ నెయ్యిని పంపినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల లాంటి పుణ్యక్షేత్రాలకూ భోలేబాబా సంస్థనే పరోక్షంగా నెయ్యిని సరఫరా చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు.

తిరుపతిలో డెయిరీకి కమీషన్లు చెల్లించి ఆ కంపెనీ పేరుతోనే కల్తీ నెయ్యిని పంపినట్లు సిట్ అధికారులు విచారణలో తేల్చారు. ఇప్పటివరకు టీటీడీకి మాత్రమే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని అంతా భావిస్తున్నారు. కానీ ఏ12గా ఉన్న భోలేబాబా డెయిరీ జనరల్‌ మేనేజర్‌ హరిమోహన్‌ రాణా నెల్లూరు ఏసీబీ కోర్టులో మూడోసారి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. దీన్ని ఏపీపీ వ్యతిరేకిస్తూ వినిపించిన వాదనల సందర్భంగా ఈ ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి.

ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా డెయిరీని 2022లో టీడీడీ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన తర్వాత మాల్‌గంగ అనే డెయిరీని తెరపైకి తీసుకొచ్చింది. ఈ కంపెనీకి కమీషన్‌ చెల్లించి.. సుగంధ ఆయిల్స్, పామోలిన్‌ సహ పలు రసాయనాలతో తయారుచేసిన కల్తీ నెయ్యిని పరోక్షంగా భోలేబాబా డెయిరీనే టీటీడీకు పంపిందని ఏపీపీ వాదన వినిపించింది. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో హరిమోహన్‌ రాణా మాస్టర్‌మైండ్‌ అని, బయటకు వెళ్తే సాక్ష్యాధారాలు మాయం చేస్తాడని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఏపీపీ వాదించగా ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించారు.

మరోవైపు సుదీర్ఘ విచారణతో కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో పాత్రధారులెవరన్నదీ సిట్‌ బృందం దాదాపుగా తేల్చేసింది. ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్న నిందితుల కోసం వేట కొనసాగుతోంది. ఏ13గా ఉన్న భోలేబాబా డెయిరీ మేనేజర్‌ చౌహాన్‌ అరెస్ట్‌ చేస్తే, ఈ కేసు మొత్తం ఓ కొలిక్కి వస్తుందని సిట్‌ అధికారులు భావిస్తున్నారు. అందుకే ఏ13 చౌహాన్‌ కోసం సిట్ గాలిస్తుంది.

About Kadam

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *