భూకైలాశ్ దేవాలయం.. హైదరాబాద్ నుంచి దాదాపుగా 110 కి.మీ. దూరంలో ఉంది. ఇది శివునికి అంకితం చేయబడిన దేవాలయం. భాగ్యనగరం నుంచి కేవలం ఒక్క రోజులో వెళ్లి రావచ్చు. మరి ఈ దేవాలయం విశిష్ట ఏంటి.? ఇక్కడికి ఎలా చేరుకోవాలి.? ఖర్చు ఎంత అవుతుంది.?
తాండూరు పట్టణానికి సమీపంలో ఉన్న భూకైలాశ్ దేవాలయం దాని అద్భుతమైన నిర్మాణం. దీని ప్రత్యేకతల కారణంగా తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రధాన ఆకర్షణ ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఇవి ఒక ప్రత్యేకమైన జలాల మధ్య ఉంచబడ్డాయి. భక్తులు ఈ జలాల్లోకి దిగి దైవ దర్శనం చేసుకునే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది. ఇది ఒక అరుదైన, ఆకర్షణీయమైన దృశ్యం.
ఈ ఆలయం నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. వాసునాయక్ అనే వ్యక్తి తన తండ్రి కోరికను నెరవేర్చడానికి ఈ ఆలయాన్ని నిర్మించాడు. తన తండ్రి తన కులదైవాలైన అంబాభవాని, శివుని ఆలయాలను తాండాలో నిర్మించాలని కోరుకున్నాడు. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేదు. తన అన్నయ్య శంకర్ రెడ్డితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించిన వాసునాయక్, ఆ వ్యాపారం నుంచి వచ్చిన లాభాలతో ఈ ఆలయాన్ని నిర్మించాడు.
ఆలయ నిర్మాణంలో తమిళనాడు నుంచి వచ్చిన శిల్పులు పాల్గొన్నారు. ఆలయంపై భాగంలో 65 అడుగుల ఎత్తైన ఒక భారీ శివుని విగ్రహం ఉంది. ఇది ఆలయం ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఇంకా, వీరభద్రుడు, ఆంజనేయస్వామి, కాళభైరవుడు వంటి ఇతర దేవతల విగ్రహాలు కూడా ఆలయంలో ఉన్నాయి. ఆలయంలోని అనేక విగ్రహాలు, ప్రత్యేకమైన జలాల మధ్య దేవతల దర్శనం ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా చేస్తాయి. ఈ ఆలయం భక్తులకు ఒక ప్రశాంతమైన, ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది.
భూకైలాశ్ దేవాలయం వికారాబాద్ జిల్లాలోని తాండూరు మండలంలో నిర్మించబడింది. ఇది తాండూర్ నుంచి దాదాపు 4 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి బస్సు లేదు ట్రైన్ ద్వారా తాండూర్ చేరుకోవాలి. అక్కడి నుంచి ఆటో ద్వారా ఇక్కడికి వెళ్ళవచ్చు. మీకు సొంత కార్ ఉంటె హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్ళవచ్చు.
మీరు ఇక్కడికి వెళ్లి రావడానికి ట్రావెల్ ఖర్చు ట్రైన్ లో అయితే ఒక్కరికి 200 కంటే తక్కువే. బస్సు అయితే రానూపోనూ 500 కంటే తక్కువగానే ఉంటుంది. మీ సొంత వాహనం అయితే మాత్రం దీని మైలేజ్ బట్టి ఇంధనం ఖర్చు ఉంటుంది. ఇక్కడ వెళ్లిన తర్వాత శివయ్య దర్శం కోసం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి టికెట్ ఒక్కరికి వంద రూపాయలగా ఉంది.