తెలుగు స్టేట్స్‌లో బర్డ్ ఫ్లూ.. వైరస్ కోళ్లు, బాతుల పాలిట మరణశాసనంగా మారింది. ఏపీలో మూడు జిల్లాలకు బర్డ్ ఫ్లూ విస్తరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంతకీ ఆ వివరాలు ఏంటి.? తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నారు.
ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో రెండు మూడు జిల్లాల్లో కోళ్ళకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. గిరిజన గురుకులాల మెనూలో చికెన్ నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు గురుకులాలు, EMRS స్కూళ్లకు చికెన్ నిలిపేశారు. చికెన్ స్థానంలో ఏదైనా శాకాహార కూర పండ్లు, స్వీట్లు అందించాలని సూచించారు. అయితే ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, చనిపోయిన కోళ్ళను సక్రమంగా పూడ్చిపెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లు, పశు సంవర్ధక శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ తీవ్రంగా ఉన్న ప్రాంతాలను రెడ్‌జోన్‌ల్‌గా గుర్తించి.. అక్కడ చికెన్ అమ్మకాలపై నిషేధాజ్ఞలు జారీ చేశారు. కోళ్లు, పౌల్ట్రీ ఉత్పత్తులపై నిఘా పెంచారు. తాజాగా కర్నూలు జిల్లా నర్సింగరావుపేటలో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో.. పౌల్ట్రీ యజమానులను అప్రమత్తం చేశారు అధికారులు. పౌల్ట్రీ నుంచి కిలోమీటర్ వరకు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెడ్‌జోన్ పరిధిలో కోళ్లు, గుడ్ల అమ్మకాలపై నిషేధం విధించారు. చుట్టూ 10 కి.మీ. వరకు సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పలు చికెన్ సెంటర్లపై అధికారులు తనిఖీలు చేశారు. ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేశారు. వారంరోజుల పాటు గుడ్లు, చికెన్‌పై నిషేధం విధించారు.
ఇదిలా ఉంటే.. బర్డ్ ఫ్లూ ఒకవేళ మనుషులకు సోకితే లక్షణాలు ఇలా ఉంటాయని డాక్టర్లు చెప్పారు. జ్వరం వచ్చి శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుంది. తీవ్రమైన గొంతు నొప్పి, పొడిదగ్గు రావచ్చు. తలనొప్పి & అలసటగా ఉంటుంది. శరీరమంతా నొప్పి, గందరగోళం, తీవ్ర అలసట అనిపించవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి అనిపించవచ్చు. కొంత మందికి మలబద్ధకం లేదా వాంతులు, విరేచనాలు కనిపించవచ్చు. శరీరమంతా కండరాల నొప్పితో బాధపడొచ్చు. కళ్ళు ఎర్రబడటం, నీరు కారడం వంటి లక్షణాలు రావచ్చు.