పూజలు.. ఇవి ఎంతవరకు ప్రభావం చూపుతాయో తెలియదు గానీ…వీటి పేరు విన్నా, వీటిని చూసిన ఎవరైనా వణికిపోతారు. మూఢనమ్మకాలను నమ్మే వారైతే వారికి ఇక నిద్రపట్టదు.. ముఖ్యంగా హర్రర్ మూవీలలో ఈ క్షుద్ర పూజలను మరి భయంకరంగా చూపిస్తారు. క్షుద్ర పూజలు ద్వారా ఎవరినైన లోబరుచుకోవటం, వారికి తెలియకుండానే వారి ఆరోగ్యాన్ని దెబ్బతీయటం, వారిని చావు అంచుల వరకూ తీసుకువెళ్ళడం వంటి సన్నివేశాలు సినిమాల్లో చూస్తూ ఉంటే ఇక ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, మంత్ర, తంత్రాలు… నిమ్మకాయలు, కోడిగుడ్డు, ఎండు మిరపకాయలు ఇలాంటివన్నీ చూస్తే ఎంతటి ధైర్యవంతుడుకైన ఎంతో కొంత భయం కలగక మానదు.
సినిమాల్లో చూస్తేనో లేక ఎక్కడో క్షుద్రపూజలు జరిగాయని వింటేనో మనం తెగ భయపడిపోతాము. అలాంటిది మన ఊరిలోనో, మన ఇంటి ముందో ఎవరో క్షుద్ర పూజలు జరిపితే పరిస్థితి ఏంటి? అమ్మో ఊహించుకుంటేనే భయమేస్తుంది కదూ.. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం మండలంలోని బుడ్డెపుపేట గ్రామ ప్రజల పరిస్థితి అదే. ప్రశాంతమైన పచ్చని బుడ్డెపుపేట గ్రామంలో సోమవారం క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపాయి. సోమవారం పొద్దు పొద్దున్నే గ్రామంలోని దక్కత గీత అనే మహిళ ఇంటిముందు రోడ్డుపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. నడిరోడ్డుపై ముగ్గేసి ..ముగ్గు చుట్టూ మంత్రించిన నిమ్మకాయలు, కోడి గుడ్డు, ఎండు మిరపకాయలు, దిష్టిబొమ్మ ఉండటంతో అవి చూసిన వారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పైగా దక్కత గీత ఇంటి ముందు ఉన్న రోడ్డుపై ఉన్న ముగ్గు నుండి ఆమె ఇంట్లోకి ప్రవేశించే ద్వారం వరకు కుంకుమతో పాదాల ముద్రలు ఉన్నాయి.
ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూడా నిమ్మకాయ, కోడి గుడ్డు ఉన్నాయి. వాటి మీద కుంకుమ జల్లి పూజలు చేసినట్టు ఉన్నాయి. దీంతో అవి చూసిన దగ్గర నుండి గీత ఆమె కుటుంబసభ్యులు ఏమి జరుగుతుందో అని వణికిపోతున్నారు. అటు గ్రామానికి సైతం ఏమి జరుగుతుందో అని అటు గ్రామస్తులు సైతం తెగ భయపడిపోతున్నారు. గ్రామంలో జన సంచారం లేని సమయంలో అంటే అర్ధరాత్రి వేళ ఇవి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. భయపెట్టేందుకు కాకతాళీయంగా చేసిన పనా లేక నిజంగానే క్షుద్ర పూజలు, చేతబడి వంటివి చేసి ఉంటారా అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అసలే ఒరిస్సా సరిహద్దు గ్రామం కావటం పైగా ఒరిస్సాలోని గ్రామాల్లో మంత్రగత్తెలు వంటివారు ఎక్కువుగానే ఉంటారు. రెండేళ్ల కిందట కూడా ఇచ్చాపురం మండలంలోని మండపల్లి గ్రామ పరిసరాలలో కూడా ఇలానే క్షుద్రపూజల జరగటం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. తమ గ్రామంలో ఇలా జరగటం ఇదే మొదటిసారని బుడ్డెపుపేట గ్రామస్థులు చెబుతున్నారు.