తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల జాతర.. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ప్రారంభం అవుతుంది. నెల రోజుల పాటు హైదరాబాద్ నగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి చల్లగా చూడమని కోరుకుంటారు. ఇక ఈ ఏడాది పండుగ రానే వచ్చింది. ఆషాడ మాసం మొదటి గురువారం గోల్కొండ కోటలో కొలువైన శ్రీ జగదాంబ మహంకాళి అమ్మకు తొలిబోనం సమర్పించడంతో బోనాల సంబురాలు షురూ అయ్యాయి.
ఆషాడ మాసం రాకతో తొలకరి జల్లులతో పాటు తెలంగాణలో బోనాల సందడిని తెచ్చింది. మహిళలు బోనమెత్తి ఆషాడ మాసం మాసంలోని తోలి గురు వారం గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలిరోజు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి పట్టుచీర, బోనాలను అమ్మవారికి అందజేశారు. బోనాలు డప్పు చప్పుళ్లు, డోలు మోతలు పోతరాజుల విన్యాసాల నడుమ అంగరంగ వైభవంగా సాగాయి. అమ్మవారి ఘటాలకు ప్రత్యేక పూజలు చేసి బోనాలను సమర్పించారు. అయితే బోనాలు అంటే ఏమిటి? ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందాం..
బోనాలు అంటే ‘విందు’ లేదా ‘భోజనం’. ఈ పండుగ సందర్భంగా అనేక రకాల గ్రామ దేవతలను పూజిస్తారు. ప్రతి దేవతకు దాని సొంత ఆలయం ప్రాముఖ్యత ఉంటుంది. మొదటి బోనంగా భక్తులు హైరాబాద్‌లోని గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయాన్ని సందర్శించి సమర్పిస్తారు. అనంతరం వరసరా బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయంలో, ఉజ్జయిని మహాకాళి ఆలయంలో, సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్‌లోని గండిమైసమ్మ ఆలయంలో బోనాల జాతరని నిర్వహిస్తారు. అనంతరం భక్తులు హైదరాబాద్ పాత నగరంలోని లాల్ దర్వాజాలోని మాథేశ్వరి ఆలయంలో, చిలకల్‌గూడలోని పోచమ్మ ఆలయంలో, కట్ట మైసమ్మ ఆలయంలో బోనాలను సమర్పిస్తారు.
ఇక ఈ ఏడాది పండుగ రానే వచ్చింది. గురువారం ఈ పండగ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఆడబిడ్డలు సమర్పించే బోనాలు అమ్మవారి సోదరులుగా భావించే పోతురాజులు చేసే విన్యాసాలు.. శివసత్తుల నృత్యాలు ఏనుగు అంబారీలు, తొట్టెల ఊరేగింపులు ఫలహార బళ్ల ప్రదర్శనలు ఇలా ఒకటేమిటి నెల రోజుల పాటు తీరొక్క వేడుకలే.
బోనాల ప్రాముఖ్యత
‘బోనాలు’ అనే పదం ‘భోజనం’ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. బోనాలు అనే పదం 19వ శతాబ్దం నాటిది. ఆ సమయంలో హైదరాబాద్‌ను ప్లేగు వ్యాధి అతలాకుతలం చేసింది. జంట నగరాల్లో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఒక సైనిక బెటాలియన్ ఉజ్జయినికి నియమించారు. వారు హైదరాబాద్లో ప్లేగు వ్యాధి గురించి ఆందోళన చెంది ఉజ్జయిని మహాకాళి దేవిని ప్రార్థించారు. నగరం మహమ్మారి నుంచి విముక్తి పొందితే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని హైదరాబాద్‌లో ప్రతిష్టిస్తామని ప్రార్ధించారు. ప్లేగు వ్యాధి తగ్గిన అనంతరం సైనికులు దేవత విగ్రహాన్ని తీసుకువచ్చి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేయడం మొదలు పెట్టారు. అలా మిలటరీ బెటాలియన్ హైదరాబాద్ కి తిరిగి వచ్చి మహానకాళికి బోనలు అర్పించడం ద్వారా విగ్రహాన్ని ఏర్పాటు చేయగా మహంకాలి ఈ వ్యాధి వ్యాప్తిని నిలిపివేసినట్లు భక్తుల అభిప్రాయం. అప్పటి నుంచి బోనాలు జాతర మొదలైంది.
బోనాలులో నిర్వహించాల్సిన ఆచారాలు
బోనం సమర్పించే రోజున మహిళలు పాలు, బెల్లం ఉపయోగించి అన్నం వండుతారు. వండిన బియ్యాన్ని తాజా ఇత్తడి లేదా మట్టి కుండలో ఉంచి వేప ఆకులు, పసుపు, సింధూరం, చిన్న దీపంతో అలంకరిస్తారు. తరువాత మహిళలు ఈ కుండలను తలపై పెట్టుకుని ఆలయానికి వెళ్లి బియ్యం, గాజులు, చీర , పసుపుతో పాటు తయారు చేసిన తీపి అన్నాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. బోనాల సంబరాలను మహిళలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కొత్త చీరలు కట్టుకుంటారు. ఆభరణాలు ధరిస్తారు. పోతురాజు నృత్యాలతో సందడి నెలకొంటుంది. బోనాల జాతర రంగం అతి ప్రధాన ఘట్టంగా నిలుస్తుంది.