డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎడ్ డిగ్రీలో ప్రవేశాలకు 2024-25 విద్యా సంవత్సరానికి ప్రకటన జారీ చేసింది. అర్హత కలిగిన వారు ఎవరైనా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ కోర్సులో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్ లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 21వ తేదీలోగా..
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ ఓడీఎల్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈడీ కోర్సులు చేసిన వారికి టెట్‌తోపాటు డీఎస్సీ రాసేందుకు అవకాశం ఉంటుంది. అందువల్లనే ఈ కోర్సులకు బలే డిమాండ్ ఉంది. దూర విద్య ద్వారా బీఈడీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు అంబేద్కర్ వర్సిటీ ఇచ్చిన ఈ ఆఫర్‌ను అభ్యర్ధులు సద్వినియోగం చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 21, 2024వవ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సు వివరాలు ఇవే..
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (బీఈడీ ఓడీఎల్) 2024-25లో ప్రవేశాలకు కనీసం 50 శాతం మార్కులతో బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీబీఎం, బీఈ, బీటెక్ డిగ్రీలలో ఏదైనా ఒక డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు ప్రాథమిక విద్యలో శిక్షణ పొందిన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులై ఉండాలి. లేదా ప్రాథమిక విద్యలో టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి రెండేళ్లు. బోధనా మాధ్యమం తెలుగులో ఉంటుంది.
అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయోపరిమితి 1 జులై, 2024 నాటికి 21 ఏళ్లు పూర్తి చేసి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు. ప్రవేశ పరీక్ష ద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 21, 2024గా నిర్ణయించారు. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 25, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.100 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులు రూ.750 చెల్లించాలి. ప్రవేశ పరీక్ష డిసెంబర్ 31, 2024వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 21, 2024.
- రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 25, 2024
- హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్: డిసెంబర్ 28, 2024
- ప్రవేశ పరీక్ష తేదీ: డిసెంబర్ 31, 2024
- ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి తేదీ: వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో
- అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభం: వచ్చే ఏడాది జనవరి మూడో వారం