25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది గులాబీ పార్టీ. బాహుబలి వేదిక.. ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసేలా ప్రదర్శనలు.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్ని విశిష్టతలు ఉండబోతున్నాయని భారతీయ రాష్ట్ర సమితి(BRS) పార్టీ సంకేతాలు ఇస్తోంది. పోరాటాల పురిటిగడ్డ వరంగల్ వేదికగా కనీవినీ ఎరుగని రీతిలో జనసమీకరణ చేసి తమ సత్తా చాటుతామంటోంది కారు పార్టీ. ఇంతకీ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి.
వరంగల్‌ను సెంటిమెంట్‌గా భావిస్తున్న గులాబీ పార్టీ.. మూడు జిల్లాల సరిహద్దు అయిన ఎల్కతుర్తి దగ్గర రజతోత్సవ మహాసభ నిర్వహించేందుకు పార్టీ ప్లాన్ చేసింది. ఏప్రిల్ 27వ తేదీన జరగబోయే ఈ మహాసభకు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల సరిహద్దు ప్రాంతం వేదికైంది. తమ సత్తా ఏంటో ఈ సభ ద్వారా చాటుతామంటోంది కారు పార్టీ కేడర్. సభకు సుమారు పది లక్షల మంది కార్యకర్తలు వస్తారని పార్టీ అంచనా వేస్తోంది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే జనాలకు ఏ మాత్రం ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్లాన్ ప్రకారం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమయం దగ్గర పడుతుండటంతో పనులు వేగవంతంగా సాగుతున్నాయి.
మొత్తం 1213 ఎకరాల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో 159 ఎకరాల్లో సభా ప్రాంగణం. 5 ఎకరాల విస్తీర్ణంలో సభా వేదిక ఉంటుంది. ఐదు వందల మంది కూర్చునేలా బాహుబలి వేదిక నిర్మాణమవుతోంది. సభకు వెనుకాలే 4 ఎకరాలు వీఐపీ పార్కింగ్‌కు కేటాయించారు. ఇక 150 ఎకరాల్లో పబ్లిక్, VIP, ప్రెస్ సహా ఉద్యమకారులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన స్థలాన్ని భోజన వసతి, పార్కింగ్ కోసం కేటాయించారు. ఎటువైపు నుంచి వచ్చే వాహనాలు అటువైపే పార్క్ చేసేలా.. ఐదు ప్రాంతాల్లో పార్కింగ్‌కు ఏర్పాటు చేస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు.
రాజకీయ పార్టీలు పెట్టే బహిరంగ సభలకు కొంత డబ్బులు ఖర్చు అవ్వడం కామన్ విషయమే. ఇక ఎన్నికల సమయంలో పెట్టే భారీ బహిరంగ సభలకు అయితే కోట్లల్లో ఖర్చు అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలకు కేరాఫ్ అడ్రస్ కచ్చితంగా భారత రాష్ట్ర సమితినే. ఉద్యమ కాలం నుంచి అధికారంలో ఉన్న ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న బహిరంగ సభలు నిర్వహించడంలో ఆ పార్టీ ప్రత్యేకత వేరు. మిగతా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలోనే బహిరంగ సభలో నిర్వహిస్తే బీఆర్ఎస్ మాత్రం కనీసం ఏడాదికి ఒకటి రెండు బహిరంగ సభలో నిర్వహిస్తూ వస్తుంది. అధికారంలో ఉండగా కొంగర కలాన్‌లో ఐదు లక్షల మందితో పెద్ద ఎత్తున సభ నిర్వహించి సక్సెస్ చేసింది. అధికారంలో ఉండగానే రైతు మహాసభ నిర్వహించింది. ఇక వరంగల్లో ఉద్యమ కాలంలో పోరుగర్జన, సింహ గర్జన లాంటి సభలను లక్షలాది మందితో సక్సెస్ చేసుకుంది. కానీ ఇప్పుడు అంతకు మించి అంటూ మరోసారి గులాబీ సత్తా చాటేందుకు ముందుకు వస్తుంది బీఆర్ఎస్.
తనకు అచ్చి వచ్చిన వరంగల్‌లోనే మరో అతి భారీ బహిరంగ సభకు తెరలేపింది. ఏప్రిల్ 27వ తేదీన పార్టీ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా ఈ బాహుబలి బహిరంగ సభ జరగనుంది. ఇందుకోసం 10 లక్షల మందిని సమీకరించాలని టార్గెట్‌గా పెట్టుకుంది గులాబీ పార్టీ. అయితే జన సమీకరణం పక్కన పెడితే ఖర్చు కూడా బాహుబలి స్థాయిలోనే కనిపిస్తుంది. ఇప్పటికే అధికారికంగా ప్రతి నియోజకవర్గానికి 25 లక్షల రూపాయలు పార్టీ తరఫున చెక్కులు విడుదల చేశారు. ఈ అమౌంట్ దాదాపుగా రూ. 30 కోట్లు. దీంతోపాటు 1200 ఎకరాలను రైతుల దగ్గర లీజుకు తీసుకుంది పార్టీ. ఈ 1200 ఎకరాల్లో చదును చేయడం, బారికేడ్లు వేయడం, రోడ్లు వేయడం, స్టేజ్, గెస్ట్ ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఇలా కేవలం సభాస్థల వద్ద మరొక 20 నుంచి 25 కోట్ల రూపాయలు ఖర్చే అవకాశం కనిపిస్తుంది.
వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 500 మంది ఆర్టిస్టులతో వాల్ రైటింగ్ నిర్వహిస్తుంది పార్టీ. ఏప్రిల్ 20వ తేదీన మొదలుపెట్టి వారం రోజులపాటు అంటే బహిరంగ సభ జరిగే 27 వరకు రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండాలు ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టించనుంది. వీటితోపాటు పేపర్లు టీవీల్లో అడ్వర్టైజ్మెంట్ లు కూడా.. వీటి కోసం మరొక 20 – 25 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇక జన సమీకరణ కోసం ఇప్పటికే ఆర్టీసీకి రూ. 9 కోట్లు చెల్లించింది భారత రాష్ట్ర సమితి. వీటితోపాటు ప్రైవేటు వాహనాలు. మధ్యలో వారికి భోజనాలు, సభా స్థలం వద్ద పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల వాటర్ ప్యాకెట్లు, కూలర్లు ఇలా వీటన్నింటికీ మరో పాతి కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇలా గులాబీ బాహుబలి బహిరంగ సభ కోసం దాదాపు రూ. 100 కోట్ల దాకా ఖర్చు పెట్టనుంది పార్టీ. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో జన సమీకరణ పరంగా చూసిన, ఖర్చుపరంగా చూసిన ఇదే భారీ బహిరంగ సభ.
ఈ బహుబలి సభకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలంతా ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు. సభా ఏర్పాట్ల దగ్గర నుంచి జనసమీకరణ వరకు అనేక కమిటీలు ఏర్పాటు చేసుకుని సమన్వయంతో పనిచేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ నేతలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.