రేవంత్ ఇంటికైనా వెళ్తా.. కేటీఆర్ సంచలన కామెంట్స్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నంత పనిచేశారు. ముందే చెప్పినట్లుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వచ్చారు. రైతు సంక్షేమంపై రేవంత్‌ సవాల్‌ను స్వీకరించిన కేటీఆర్ చర్చించేందుకు ప్రెస్ క్లబ్‌కు రావాలంటూ సీఎంకు ప్రతిసవాల్ విసిరారు. సీఎం ఢిల్లీలో ఉన్నారు కాబట్టి.. మంత్రులెవరైనా వచ్చినా వారితో చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు.

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి.  రైతులకు 9రోజుల్లో రూ.9వేల కోట్లు వేశామని.. రైతు సంక్షేమంపై బీఆర్ఎస్, బీజేపీ దమ్ముంటే చర్చకు రావాలంటూ తొలుత సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. సవాల్‌కు సిద్ధమని ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రావాలంటూ ప్రతిసవాల్ విసిరారు. చెప్పినట్లుగానే కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వెళ్లారు. అయితే సీఎం ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రాభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రమంత్రులను కలుస్తున్నారు. సీఎం ఢిల్లీలో  ఉంటే మంత్రులైనా చర్చకు రావాలని కేటీఆర్ అన్నారు. రేవంత్‌కు రచ్చ చేయడం తప్ప.. చర్చ చేయడం రాదన్నారు. ‘‘రేవంత్ మాట తప్పుతారని తెలిసినా సవాల్‌ను స్వీకరించి చెప్పిన టైమ్‌కు ప్రెస్ క్లబ్‌కు వచ్చాం. కనీసం మంత్రులైనా వస్తారనుకున్నా.. కానీ ఎవరు రాలేదు’’ అని కేటీఆర్ విమర్శించారు.  రైతులపై సీఎం, మంత్రులకు గౌరవం లేదన్నారు.

రైతుల సంక్షేమంపై రేవంత్ అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే 600మందికి పైగా రైతులకు రైతు బంధు రాలేదన్నారు. రైతుల మరణాల లిస్టు కూడా రెడీగా ఉందని చెప్పారు. రైతుల సంక్షేమంపై చర్చించడానికి రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని అన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌కు కేటీఆర్ మరో సవాల్ విసిరారు. ‘‘సీఎం చర్చ ఎక్కడ పెట్టినా ఒకే. చర్చ కోసం అవసరమైతే రేవంత్ తన ఇంటికి రమ్మన్నా వెళ్తా. చర్చించే సత్తా లేకపోతే మరోసారి సవాళ్లు విసరొద్దు’’ అని కేటీఆర్ అన్నారు. దమ్ముంటే రేవంత్ చర్చకు రావాలి.. లేదా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి హామీలు అమలుచేయకుండా రంకెలు వేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు పక్కా అమలు చేస్తామంటూ బాండ్ పేపర్లు రాసిచ్చారు.. ఇప్పుడు అవి ఎటుపోయాయంటూ ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణను సాధిస్తే.. రేవంత్ పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి తరలిపోతున్నాయని ఆరోపించారు. ఎరువుల బస్తాల కోసం రేవంత్ ఢిల్లీ వెళ్లలేదని.. ఢిల్లీ పెద్దల కోసం ఏం బస్తాలు తీసుకెళ్లారో అందరికీ తెలుసని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేతలు, అక్రమ కేసులు అన్న కేటీఆర్.. కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు.  రైతు సంక్షేమంపై అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమని ప్రకటించారు. 9 రోజుల్లో రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామన్నారు. అసెంబ్లీకి రమ్మంటే బీఆర్ఎస్ నేతలు పారిపోతున్నారని విమర్శించారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ పెట్టాలని కేసీఆర్ లేఖ రాస్తే పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కేటీఆర్ ముందు కేసీఆర్‌తో లేఖ రాయించాలని సూచించారు.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *