మెగా డీఎస్సీ ఉద్యోగ నియామకాలు దాదాపు ముగిసిన దశలో ఉండగా.. హైకోర్టులో కొందరు పిటీషన్లు వేశారు. పోస్టుల ప్రాధాన్యం వ్యవహారాన్ని తేల్చాలంటూ పిటీషనర్లు ఇందులో కోరారు. వీటిని తాజాగా విచారించిన కోర్టు దరఖాస్తు దాఖలు సమయంలోనే అభ్యర్థుల నుంచి పోస్టుల ప్రాధాన్యం (ప్రిఫరెన్స్) ఐచ్ఛికాన్ని కోరడం సరికాదని..
రాష్ట్రంలో కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ దాదాపు ముగిసిన దశలో హైకోర్టులో కొందరు పిటీషన్లు వేశారు. పోస్టుల ప్రాధాన్యం వ్యవహారాన్ని తేల్చాలంటూ పిటీషనర్లు ఇందులో కోరారు. వీటిని తాజాగా విచారించిన కోర్టు దరఖాస్తు దాఖలు సమయంలోనే అభ్యర్థుల నుంచి పోస్టుల ప్రాధాన్యం (ప్రిఫరెన్స్) ఐచ్ఛికాన్ని కోరడం సరికాదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్‌జీటీ), స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టుల భర్తీ విషయంలో మెరిట్ లిస్ట్ తయారీ అనంతరం అభ్యర్థుల నుంచి ఐచ్ఛికాలు తీసుకోవాలని తెలిపింది. అలా కాకుండా దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఐచ్చికాలను పరిగణనలోకి తీసుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సింగిల్ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలూ విని 4 వారాల్లో ఈ అంశాన్ని తేల్చాలని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం సెప్టెంబరు 16న ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా మొత్తం 16,347 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయగా 3,36,300 మంది నుంచి 5,77,675 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో అన్నిరకాల పోస్టులకు కలిపి 15,941 మంది ఎంపికయ్యారు. ఇందులో 7,955 మంది మహిళలు ఉన్నారు. అయితే కొందరు రెండు, మూడు పోస్టులకు ఎంపికవగా.. వారి ప్రాధాన్యాలను విద్యాశాఖ పరిగణనలోకి తీసుకోకుండా దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఐచ్చికాలనే తుది నిర్ణయంగా భావించి, ఆ మేరకు పోస్టింగులు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో అభ్యర్ధులు తాము నష్టపోతున్నట్లు పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు.
ఏపీ ఐటీఐ నాలుగో విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో మూడో విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విజయవాడ ప్రభుత్వ ఐటీఐ- కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ కనకారావు ఓ ప్రకటనలో కోరారు. 10వ, 8వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు సెప్టెంబరు 27వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత పత్రాలతో సెప్టెంబర్ 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోపు ఆయా ఐటీఐ కాలేజీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరుకావాలని సూచించారు. ప్రభుత్వ ఐటీఐల్లో సెప్టెంబర్ 29న, ప్రైవేటు ఐటీఐల్లో సెప్టెంబర్ 30న కౌన్సెలింగ్ జరుగుతుందని వివరించారు. ఇతర వివరాలకు 0866-2475575, 94906 39639, 77804 29468 ఫోన్ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.