ఏడాదిలో రెండు సార్లు పదో తరగతి పరీక్షల నిర్వహణకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) బుధవారం (జూన్ 25) ఆమోదం తెలిపింది. ఈ విధానం 2026 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. అంటే 2026 నుంచి ఏడాదికి రెండు సార్లు సీబీఎస్సీ పదో తరగతి బోర్డు పరీక్షలు నిర్వహిస్తారన్నమాట. ఈ మేరకు ఒక విద్యా సంవత్సరంలో రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరు కావడానికి వీలు కల్పించే కొత్త వ్యవస్థను ప్రవేశపెడుతుందని అధికారులు బుధవారం (జూన్ 25) తెలిపారు.
కొత్త విధానం ప్రకారం తొలి విడత పదో తరగతి పరీక్షలను తప్పనిసరిగా విద్యార్ధులు అందరూ రాయవల్సి ఉంటుంది. తొలి విడత పరీక్షలు ఫిబ్రవరి నెలలో జరుగుతాయి. రెండో విడత పదో తరగతి పరీక్షలను ఆప్షనల్‌గా పెట్టింది. రెండో విడత పరీక్షలు మే నెలలో జరుగుతాయి. మే లో జరిగే పరీక్షలు మాత్రం ఆప్షనల్. అంటే మార్కులు పెంచుకోవాలని భావించే విద్యార్ధులు ఈ పరీక్షలు రాయవచ్చన్నమాట. రెండు విడతల్లో మంచి స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటామని బోర్డు తెలిపింది. ఈ విధానం జాతీయ విద్యా విధానం (NEP)కి అనుగుణంగా ఉందని, ఇది విద్యార్ధులకు ఒకే విద్యా సంవత్సరంలో రెండవ ప్రయత్నాన్ని అందించడం ద్వారా వారి పరీక్ష ఒత్తిడిని తగ్గించడానికి అవకాశం ఉంటుందని బోర్డు తెలిపింది.
మొదటి దశ ఫిబ్రవరిలో, రెండవ దశ పరీక్షలు మేలో నిర్వహిస్తామని CBSE పరీక్ష కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ అన్నారు. రెండు దశల ఫలితాలు వరుసగా ఏప్రిల్, జూన్‌లలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు. విద్యార్ధులు మొదటి దశకు హాజరు కావడం తప్పనిసరి. రెండవ దశ ఆప్షనల్. విద్యార్థులు సైన్స్, గణితం, సాంఘిక శాస్త్రం, ల్వాంగ్వేజ్‌లలో ఏవైనా మూడు సబ్జెక్టులలో తమ స్కోర్‌ను మెరుగుపరచుకోవడానికి రెండో దశలో పరీక్షలు రాయడానికి అవకాశం కల్పిస్తామని ఆయన వివరించారు. శీతాకాలంలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు రెండు దశల్లో దేనిలోనైనా హాజరు కావడానికి అవకాశం కల్పించామని అన్నారు. విద్యా సెషన్‌లో అంతర్గత మూల్యాంకనం ఒక్కసారి మాత్రమే నిర్వహించబడుతుంది.
CBSE ఫిబ్రవరిలో ముసాయిదా నిబంధనలను విడుదల చేసి బోర్డు.. పాఠశాలలు, ఉపాధ్యాయులు, ఇతర వాటాదారుల నుండి అభిప్రాయాన్ని ఆహ్వానించింది. బోర్డు పరీక్షలను తక్కువ ఒత్తిడితో నిర్వహించాలనే ప్రయత్నాలలో భాగంగా తుది ఆమోదం తాజాగా లభించడంతో 2026 నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. గత నెలలో, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా 2026 నుంచి CBSE 10వ తరగతి బోర్డు పరీక్షలను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది మరింత ఒత్తిడి లేని అభ్యాస వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Amaravati News Navyandhra First Digital News Portal