నేను రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నా.. అయినా.. కొందరు నాపై అకారణంగా విమర్శలు చేస్తున్నారు .. ఆ విమర్శలకు నేను చేసిన మంచి పనులే జవాబు.. అంటూ మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై తాను మాట్లాడకపోయినా తాను చేసిన మంచి మాట్లాడుతుందని అగ్ర కథానాయకుడు చిరంజీవి చెప్పుకోచ్చారు.. ఫీనిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌కు మెగాస్టార్ చిరంజీవి, తేజా సజ్జా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిరంజీవి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కొందరు తనపై ఆకారణంగా నోరు పారేసుకుంటున్నారని అన్నారు. ఇటీవల ఓ నాయకుడు తనపై విమర్శలు చేస్తే ఆ ప్రాంతానికే చెందిన మహిళ ఎదురు తిరిగిందన్నారు. ఆ వీడియో చూసి సదరు మహిళ గురించి వాకబు చేస్తే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆవిడ బిడ్డ ప్రాణం నిలబడిందని తెలిసిందన్నారు. ఎప్పుడైనా మనం చేసే పనులే మాట్లాడుతుంటాయంటూ చిరంజీవి వివరించారు.
ఒక జర్నలిస్ట్ మూలంగా తనకు బ్లడ్ బ్యాంక్ పెట్టాలనే ఆలోచన వచ్చిందని ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చిరంజీవి పేర్కొన్నారు. ఆయన రాసిన ఆర్టికల్ చదివిన తర్వాతే తనకు బ్లడ్ బ్యాంక్ పెట్టాలనే.. ఈ ఆలోచన వచ్చిందన్నారు. ఆయనను ఇప్పటివరకూ చూడలేదు కానీ, ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటానని చిరంజీవి అన్నారు.
ఒకప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆమె బిడ్డ ప్రాణాలు నిలిచాయని.. అందుకే.. ఆమెకు తానంటే గౌరవమని.. ఆ మాటలు విని తన హృదయం ఉప్పొంగిందంటూ చిరంజీవి పేర్కొన్నారు. అందుకే తాను ఎప్పుడూ సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ అలాగే.. దేనికీ.. స్పందించనంటూ పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి బ్లడ్ డొనేట్ చేసిన వారందరినీ అభినందించారు.
కాగా.. గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అనంతరం రాజ్యసభ సభ్యుడిగా.. కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత చాలా ఏళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే..