అడవుల్లో నుంచి జనావాసంలోకి వచ్చిన చిరుత పులి హల్చల్ చేసింది. చిరుతను బంధించేందుకు రైతులు పడిన కష్టమంతా అంతా కాదు. చివరకు ఓ రైతుపై చిరుత పంజా విసిరింది. తీవ్ర గాయం కావడంతో రైతులంతా ఏకమై చిరుతను వలలో బంధించారు. ఇదంతా గమనిస్తున్న రైతులు అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.
కర్నూలు జిల్లా కోసిగి తిమ్మప్ప, బసవన్న కొండల్లో చిరుతలు గత కొంతకాలంగా సంచరిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం బసవన్న కొండ వెనుక ఉన్న ఎర్ర వంకలో చిరుత పులి కనిపించింది. అనారోగ్య సమస్యతో పరిగెత్తడం చేతకాకపోవడంతో యువకులు ప్రజలు దాన్ని వీడియోలు ఫోటోలు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ హనుమంత రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి జనం చిరుత వద్దకు వెళ్లకుండా చదరగొట్టారు. సమాచారం అందించి రెండు గంటలైనా అటవీ శాఖ అధికారులు రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున కోసిగి కి తరలివచ్చి చూశారూ .అనంతరం అటవీశాఖ అధికారులు వచ్చి చర్యలు తీసుకోవాల్సింది పోయి..చిరుతను చూస్తూ నిలుచుండటంతో స్థానిక రైతులు ఏకమై చిరుతను బంధించేందుకు ప్రయత్నం చేశారు. ఎలాగోలా శ్రమించి చిరుతను వలలో బంధించారు.
అటవీ శాఖ అధికారులకు పట్టించారు. చిరుతను బంధిస్తున్న సమయంలో చిరుత యువ రైతుపై పంజా విసరడంతో బాధిత రైతు వీరేశ్ కాలుకు తీవ్ర గాయం అయింది. జిల్లా అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఇదిలా ఉండగా చిరుతను చూసేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దీంతో పత్తి పంట ఇష్టానుసారంగా తొక్కడంతో నాశనమైంది. సంబంధిత రైతులకు నష్టపరిహారం అందించాలని అటవీశాఖ అధికారులకు రైతులు డిమాండ్ చేశారు. మరోవైపు ప్రజల చేత బంధించబడిన చిరుతను తిరుపతి జూ పార్కు తరలించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.