అలా ఎలా నమ్మించావురా.. ఒంటరి మహిళ నుంచి రూ.28 కోట్లు కొట్టేసిన కేటుగాడు!.. ఎలాగో తెలిస్తే షాక్!

చిత్తూరు జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. భర్త, కొడుకు చనిపోయి తోడుకోసం చూస్తున్న ఓ మహిళను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న కేటుగాడు, ఆమె నుంచి ఏకంగా రూ.28 కోట్లు కొట్టేశాడు. డబ్బులు ఇచ్చిన కొన్నాళ్లకు నిందితుడి బండారం బయటపడడంతో మోసపోయినట్టు గ్రహించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘరానా మోసం బయటకొచ్చింది.

భర్త, కొడుకు చనిపోయి తోడుకోసం చూస్తున్న ఓ మహిళను రెండో పెళ్లి చేసుకొని, ఆమె నుంచి ఏకంగా రూ.28 కోట్లు కొట్టేశాడు ఓ కేటుగాడు. ఆమె నుంచి డబ్బులు కొట్టేసేందుకు నిందితుడు ఆడిన నాటకం చూస్తే నోరువెల్లబెట్టాల్సిందే. వివరాల్లోకి వెళితే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రామకుప్పం మండలం రాజుపేటకు చెందిన ఓ మహిళకు 25 ఏళ్ల క్రితం బెంగళూరుకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్లుకు వీరిద్దరికి ఒక పిల్లాడు పుట్టాడు. కానీ దురదృష్టవశాత్తు 15 ఏళ్లకే బాలుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కుమారుడు చనిపోయిన కొన్నేళ్లకు ఆమె భర్త కూడా అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. భర్త, కొడుకు చనిపోవడంతో ఆమె ఒంటరిగా మిగిలి పోయింది.

అయితే కొన్నాళ్ల తర్వాత తనకు తోడు కావాలని, అందుకు భార్య చనిపోయి పిల్లలు లేని వారు ఎవరైనా ఉంటే చూడమని చిత్తూరుకు చెందిన ఓ మ్యారేజ్‌ బ్రోకర్‌ను ఆమె కలిసింది. ఈ క్రమంలోనే మ్యారేజ్‌ బ్రోకర్‌ నుంచి ఆమె వివరాలు తీసుకున్న శేషాపురానికి చెందిన ఓ వ్యక్తి.. అమె దగ్గర బాగా డబ్బు ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకొని ఆ డబ్బును కొట్టేయాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే ఆమెను సంప్రదించాడు. తన భార్య చనిపోయిందని, తనకు పిల్లలు కూడా లేరని.. ఈ పెళ్లికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమెను నమ్మించాడు. దీంతో 2022లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమె దగ్గరే ఉంటూ, మొదటి భార్యకు బెంగళూరులో జాబ్‌ చేస్తున్నట్టు చెప్పి నమ్మించాడు. ఇక అలాగే కొన్ని రోజులు పాటు వ్యవహారం నడిపించిన తర్వాత తను అనుకున్న ప్లాన్‌ను అమలు చేసేందుకు సిద్ధమయ్యాడు.

అయితే ఆర్బీఐ బ్యాంక్‌ నుంచి తనకు రూ.1700 కోట్లు రావాల్సి ఉందని.. అందుకు సంబంధించిన ఫేక్‌ ఆర్బీఐ లెటర్స్‌ను ఆమెకు చూపి నమ్మించాడు. కానీ రూ. 1700 కోట్లను విడుదల చేయాలంటే.. ఆర్బీఐకు రూ.15 కోట్ల టాక్స్ చెల్లించాలని అతను చెప్పుకొచ్చాడు. ఇదంతా నిజమేనేమో అని నమ్మిన మహిళ తన అకౌంట్‌లో నుంచి రూ.3కోట్లను అతని, అన్న, వదిన అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇదే కాకుండా బాధిత మహిళకు చెందిన రూ.10 కోట్లు విలువచేసే వ్యవసాయ భూమి, రూ. 15 కోట్ల విలువచేసే బెంగళూరులోని బిల్డింగ్‌ను సైతం అమ్మేసి డబ్బులు తీసుకున్నాడు కేటుగాడు.

అయితే, డబ్బులు ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్న ఆర్బీఐ నుంచి ఎలాంటి డబ్బు రాకపోవడంతో అనుమానం వచ్చిన మహిళ.. అతన్ని నిలదీసింది. దీంతో ఆమెకు ఎక్కడ నిజం చెప్పాల్సి వస్తుందోనని భయపడిన అతను గతేడాది బాధితురాలి ఇంట్లో నుంచి పారిపోయాడు. ఇక నిందితుడి కోసం వెతుక్కుంటూ అతని స్వగ్రామానికి వెళ్లిన మహిళకు అక్కడ తనను పెళ్లి చేసుకున్న వ్యక్తికి భార్య, పిల్లలు ఉన్నట్టు తెలిసింది. దీంతో షాక్‌కు గురైన మహిళ తాను మోసపోయినట్టు గ్రహించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

About Kadam

Check Also

సుప్రీంకోర్టులో నిమిష ప్రియ కేసు విచారణ… తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా

యెమెన్‌ దేశంలో కేరళ నర్స్‌ నిమిషా ప్రియకు ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. ఈ మేరకు కోర్టుకు తెలిపారు పిటిషనర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *