ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. మరి ఆ ఎజెండాలో ఉన్న అంశాలేంటి? అమరావతికి సంబంధించి ప్రభుత్వ ప్రణాళికలేంటి? తెలుసుకుందాం.
ఇటు పాలనతో పాటు అటు రాజధాని అమరావతి నిర్మాణంపై కూడా వేగం పెంచింది కూటమి ప్రభుత్వం. అమరావతి సహా ఏపీ అభివృద్ధి అంశాలపై ప్రధానంగా చర్చించేందుకు ఏపీ మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది. మంగళవారం(ఏప్రిల్ 15) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం.
అమరావతి రాజధాని నిర్మాణంలో ఫేజ్ 2 భూసేకరణపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. అలాగే సీఆర్డీయే 46వ అథారిటీలో ఆమోదించిన అంశాలన్నింటికీ ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం సీఆర్డీయే కమిషనర్ నిధులు సమీకరించుకునే అంశంపై మంత్రులు చర్చించనున్నారు. అనంతరం నిధుల సమీకరణకు క్యాబినెట్ అనుమతి ఇవ్వనుంది. అలాగే ఉండవల్లి, పెనుమాక రైతుల జరీబు భూములకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే అంశంపై సీఆర్డీయే అథారిటీ తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్లో అనుమతి లభించనుంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీ, హైకోర్ట్ భవనాల టెండర్లకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. 5వ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన అంశాలకు సైతం క్యాబినెట్‌లో గ్రీన్ సిగ్నల్ పడనుంది. కొత్తగా రూ.30,667 కోట్ల పెట్టుబడులు.. 32,133 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకూ ఆమోదముద్ర వేయనున్నారు మంత్రులు. అలాగే రాజధానిలో ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూకేటాయింపులు చేసే అంశంపైనా చర్చించి ఆమోదం తెలపనున్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal