ఏఐ టెక్నాలజీతో వీడియోలు క్రియేట్ చేశారు.. ఓయూకు మళ్లీ వస్తా.. ఒక్క పోలీస్ ఉండొద్దు..

ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) తెలంగాణకు ప్రత్యామ్నాయ పదమని.. 4 కోట్ల తెలంగాణ వాసుల గళం ఉస్మానియా అని.. సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.. నిజాంకు వ్యతిరేకంగా పీవీ నరసింహారావు.. ఓయూ గడ్డమీద నుంచే ధిక్కారస్వరం వినిపించారన్నారు. పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, జార్జిరెడ్డి, గద్దర్‌లను తెలంగాణకు అందించిన విశ్వవిద్యాలయం ఓయూ అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి కొనియాడారు.. తెలంగాణ సమాజానికి సమస్య వచ్చినా సంక్షోభం వచ్చినా చర్చ ఇక్కడే జరుగుతుంది.. తెలంగాణలో సమస్య ఏదైనా ఉద్యమం ఇక్కడే మొదలవుతుందన్నారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఓయూలో కొత్త హాస్టల్ భవనాలను ప్రారంభించారు. గిరిజన విద్యార్థుల కోసం మరో రెండు హాస్టళ్లకు శంకుస్థాపన చేశారు. సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని కూడా రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు.. అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులనుద్దేశించి సీఎం ప్రసంగించారు. ఉస్మానియా యూనివర్సిటీ పోరాటం నేర్పిందని.. 4 కోట్ల తెలంగాణ వాసుల గళం ఉస్మానియా అన్నారు. జార్జిరెడ్డి, శ్రీకాంతాచారి, వేణుగోపాలరెడ్డి వంటివారు ఉద్యమంలో అమరులయ్యారంటూ పేర్కొన్నారు. అలాంటి ఓయూను కాలగర్భంలో కలిపేయాలని కుట్ర జరిగిందని.. ఓయూ అభివృద్ధికి మళ్లీ తాను సీఎం అయ్యాక బాటలు వేశానని సీఎం రేవంత్ అన్నారు. 108 ఏళ్ల యూనివర్శిటీకి దళితుడిని వీసీ చేసి చూపించామన్నారు.

తాను మళ్లీ డిసెబంర్‌లో ఉస్మానియా యూనివర్సిటీకి వస్తానని.. అప్పుడు ఒక్క పోలీస్‌ను కూడా పెట్టకండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ దగ్గరే సెక్యూరిటీ లేకుండా మీటింగ్ పెడతా.. అప్పుడు విద్యార్థులు నిరసన తెలిపినా నేను ఏమీ అనను అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే చిత్తశుద్ధి ఉందన్నారు.

‘‘నేను మళ్లీ ఓయూకు వస్తా.. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా.. ఆరోజు ఒక్క పోలీస్‌ కూడా ఉండొద్దు.. ఎవరి అభిప్రాయం వాళ్లు చెప్పొచ్చు.. ఆరోజు ఒక్క పోలీస్‌ కూడా క్యాంపస్‌లో ఉండరు.. డిసెంబర్‌లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్‌ పెట్టండి.. అదేరోజు అక్కడికక్కడే జీవోలు ఇస్తా.. ఓయూకు ఏం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

సెంట్రల్ యూనివర్సిటీ వివాదంపై స్పందించిన రేవంత్ రెడ్డి

సెంట్రల్ యూనివర్సిటీ వివాదంపై రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు.. సెంట్రల్ యూనివర్సిటీలో ఏనుగులు, సింహాలు ఉన్నాయని.. ఏఐ టెక్నాలజీతో వీడియో క్రియేట్ చేశారన్నారు.. ఏనుగులు, మానవ మృగాలు ఫామ్‌హౌస్‌లలో ఉన్నాయి.. ముందు వాటిని బంధించాలి అంటూ పేర్కొన్నారు.

ప్రొ.కోదండరామ్ ఎమ్మెల్సీ పదవిపై కుట్ర చేశారు..

ప్రొ.కోదండరామ్ MLC పదవిపై కుట్ర చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ వరకు వెళ్లి కోదండరామ్‌పై కుట్రలు చేశారు.. 15రోజుల్లో MLCగా కోదండరామ్‌ను పంపిస్తా అంటూ పేర్కొన్నారు.

నా దగ్గర పంచడానికి భూములు లేవు..

నా దగ్గర పంచడానికి భూములు లేవు.. ఖజానా లేదు.. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ పెట్టి గుంజుకోవడానికి భూములు లేవంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మిమ్మల్ని ధనవంతులను చేయడానికి నా దగ్గర ఏం లేవు.. మీకు ఇవ్వగలిగేది నాణ్యమైన విద్య మాత్రమే.. మీరు బాగా చదువుకోండి, ధనవంతులు అవ్వండి.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

హరీష్ రావుకు సీఎం కౌంటర్..

సీఎం ఓయూకు వస్తున్నారని విద్యార్థులను అరెస్ట్‌ చేశారు..దమ్ముంటే గన్‌మెన్లు, పోలీసులు లేకుండా సీఎం ఓయూకు వెళ్లాలని సీఎంకు సవాల్‌ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇదే అంశంపై సీఎం రేవంత్‌ రెడ్డి ఓయూలో మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చారు.

About Kadam

Check Also

కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావుది కీలక పాత్ర.. వారిద్దరి వల్లే కేసీఆర్‌కు అవినీతి మరకలు.. కవిత సంచలన ఆరోపణలు..

కాళేశ్వరం అవినీతిలో మాజీ మంత్రి హరీశ్ రావు పాత్ర కీలకమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. అందుకే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *