తెలంగాణలో ఆదాయ-వ్యయాలు ఎలా ఉన్నాయి. నెలవారీ వస్తున్న వసూళ్లెంత?. ఖర్చవుతుంది ఎంత?. అభివృద్ధి, సంక్షేమానికి నిధుల కొరత ఉందా అంటే.. అవుననే సమాధానం వస్తుంది. నెలవారీ ఆదాయం మరో 4వేల కోట్లు పెరిగితే తప్ప.. ఆర్థిక పరిస్థితి మెరుగు పడదు అంటున్నారు సీఎం. మరి.. ఆ 4వేల కోట్ల ఆదాయం పెరిగేందుకు ఏం చేయబోతున్నారు?. ఎలా ఖజానా నింపబోతున్నారు..?
తెలంగాణ ఆర్థిక కష్టాలను క్లియర్ కట్‌గా బయటపెట్టారు సీఎం రేవంత్. నెలవారీ రాష్ట్రంలో వస్తున్న ఆదాయం ఎంత, దేనికి ఎంత ఖర్చవుతుంది?.. అభివృద్ధి, సంక్షేమానికి నిధులపై మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకు 18వేల 500కోట్ల ఆదాయం వస్తుందన్నారు. అయితే.. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడం, ప్రభుత్య ఉద్యోగుల జీతాలకే ప్రతి నెలా 13వేల కోట్లు ఖర్చవుతుందన్నారు సీఎం. మిగతా ఐదు వేల కోట్లతోనే సంక్షేమం, అభివృద్ధి చేయాలని చెప్పారు. రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చులు.. హామీల అమలుకు మరో 4వేల కోట్లు ఉంటే బిందాస్‌గా పనిచేసుకోవచ్చన్నారు సీఎం రేవంత్.
తెలంగాణలో మరో 4వేల కోట్ల ఆదాయం పెంచేందుకే తాము కసరత్తు చేస్తున్నామంటున్నారు సీఎం రేవంత్. జీఎస్టీ వసూళ్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వసూళ్లు మొన్నటి వరకు కాస్త నెమ్మదించినా.. ఈ ఏడాది నుంచి వాటిపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టడంతో వసూళ్లు పెరిగాయి. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్‌లు, ఇసుక అక్రమ రవాణా కట్టడి, ఎల్‌ఆర్ఎస్‌ల లాంటి వాటిపైనా దృష్టి పెట్టడంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇటీవల బీర్లపై ధరలు పెంచడంతో.. ఎక్సైజ్‌శాఖ నుంచి ఆదాయం పెరుగుతోంది. వీటికి తోడు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, ఆర్థిక సాయం, అభివృద్ధి పనులకు నిధులను సాధించడంపై కూడా సీఎం పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ప్రధాని మోదీని మరోసారి కలిశారు సీఎం రేవంత్. రాష్ట్రంలో సమస్యలు వివరించి, అభివృద్ధికి సహకరించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరుగ్యారంటీలు అమలుతో పాటు.. అభివృద్ధి, సంక్షేమానికి ఎటువంటి లోటు రాకుండా ఉండాలంటే.. నెలకు దాదాపు 10వేల కోట్లు అవసరమని సీఎం భావిస్తున్నారు. ఇందుకు.. వివిధ రూపాల్లో ఆదాయం పెంచుకోవడం తప్ప.. ప్రభుత్వానికి మరో ఆప్షన్ లేదు. అందుకే ఖజానాపై ఫోకస్ పెట్టి.. నిధుల వేటలో ఉంది తెలంగాణ సర్కార్.