హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయి.. మైక్రోసాఫ్ట్ నూతన భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, మైక్రోసాఫ్ట్ ఇండియా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ తర్వాత క్యాంపస్ అంతా తిరిగి పరిశీలించారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ మరో కీలక నిర్ణయం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 1.2 లక్షల మందికి పైగా అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ శిక్షణను అందించేందుకు మూడు కొత్త ప్రోగ్రాంలను ప్రకటించింది.

ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను విస్తరించింది. గచ్చిబౌలిలో 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన ప్రమాణాలతో కొత్త భవనం నిర్మించింది. ఇందులో 2,500 మంది ఉద్యోగులకు సరిపడే సదుపాయాలుంటాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గురువారం మైక్రోసాఫ్ట్ కొత్త భవనం ప్రారంభించారు. అనంతరం క్యాంపస్ అంతా తిరిగి పరిశీలించారు సీఎం రేవంత్.

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ మరో కొత్త క్యాంపస్‌ను ప్రారంభించుకోవడం గర్వంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయి అని చెప్పారు. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందన్నారు. హైదరాబాద్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్‌ను మైక్రోసాఫ్ట్ క్రియేట్ చేసిందన్నారు సీఎం. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ మరో కీలక నిర్ణయం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 1.2 లక్షల మందికి పైగా అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ శిక్షణను అందించేందుకు మూడు కొత్త ప్రోగ్రాంలను ప్రకటించింది. ADVANTA(I)GE TELANGANA ప్రోగ్రాం పేరిట మైక్రోసాఫ్ట్ 500 ప్రభుత్వ పాఠశాలల్లో AI కోర్సును పరిచయం చేసేందుకు AI ఫౌండేషన్స్ అకాడమీ ప్రారంభిస్తోంది. దీంతో దాదాపు 50 వేల మందికి విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది.

AI-ఇండస్ట్రీ ప్రో పేరుతో మరో కార్యక్రమాన్ని చేపడుతుంది. రాష్ట్రమంతటా 20,000 మంది పరిశ్రమల నిపుణులకు నైపుణ్యాలను నేర్పిస్తుంది. AI-గవర్న్ ఇనీషియేటివ్ పేరుతో రాష్ట్రంలోని దాదాపు 50 వేల మంది ప్రభుత్వ అధికారులకు AI, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ప్రొడక్టివిటీ వంటి కీలకమైన రంగాలలో శిక్షణ ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో AI సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ స్థాపించనుంది. AI నాలెడ్జ్ హబ్‌తో పాటు AI అభివృద్ధికి క్లౌడ్-ఆధారిత మౌలిక సదుపాయాలు ఇందులో ఉంటాయి. రాష్ట్రంలో వేలాది మంది ఉద్యోగులకు ఉపయోగపడేలా రీసేర్చీ, కేస్ స్టడీస్, ఉత్తమ పరిశోధన పద్ధతులు అందుబాటులో ఉంచుతుంది. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధితో పాటు రాష్ట్రంలో హైపర్‌ స్కేల్ AI డేటా సెంటర్లలో తన పెట్టుబడులను రెట్టింపు చేస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

రాబోయే సంవత్సరాల్లో వీటికి అదనంగా రూ. 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కు అతిపెద్ద డేటా హబ్‌‌గా అవతరించనుంది. ఈ ప్రణాళికలకు సంబంధించి మైక్రోసాఫ్ట్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ ప్రతినిధులను అభినందించారు.

About Kadam

Check Also

25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు అట్టహాసంగా ఏర్పాట్లు!

25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది గులాబీ పార్టీ. బాహుబలి వేదిక.. ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *