కాంగ్రెస్ అంటేనే నిలదీతలు.. నినాదాలు కామన్. కానీ మంగళవారం జరిగిన పీఏసీ సమావేశంలో ఇవేవీ కనిపించలేదు. అంజన్ కుమార్ లాంటి నేతలు పదవులపై ప్రశ్నిస్తే.. జగ్గారెడ్డి లాంటి నేతలు రేవంత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే కార్యకర్తలను ఖుషీ చేయాలంటూ సూచనలు చేశారు. మరోవైపు ధర్నా బ్యాచ్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం హాట్‌గా జరిగింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తమ సామాజికవర్గమంతా అసంతృప్తిగా ఉందన్నారు. తెలంగాణలో యాదవులకు కీలక పదవులు ఇవ్వలేదన్నారాయన. సిటీలో యాదవుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున తమకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలన్నారు. తన పాత్ర కీలకంగా ఉందన్నారు. ఇండైరెక్ట్‌గా తనకు పదవి ఇవ్వాలని కోరారు అంజన్ కుమార్ యాదవ్. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్‌ను పొగుడుతూనే సున్నితంగా ప్రశ్నించారు. సీఎం రేవంత్ అదృష్టవంతుడన్నారు. ఆయన టైమ్ బావుందన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా పీఏసీలో రేవంత్‌ను ఎవరూ ఎదురు ప్రశ్నించలేదన్నారు. నేతలను బాగా సమన్వయం చేశారంటూ కితాబిచ్చారు. కేసీఆర్ పదేళ్ల పాలనకంటే రేవంత్ ఏడాదిన్నర పాలన బావుందన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ ఖుషీగా ఉన్నారని.. కాంగ్రెస్ కార్యకర్తలను కూడా ఖుషీ చేయాలని సూచించారు జగ్గారెడ్డి. పదేళ్లు జేబులు ఖాళీ చేసుకున్న కార్యకర్తలకు ఆర్థికంగా తోడ్పాటు అందించాలన్నారు జగ్గారెడ్డి. కార్యకర్తలు ఖుషీగా ఉంటేనే పథకాలు ప్రజల్లోకి చేరుతాయన్నారు.
నేతలంతా మాట్లాడింది విన్న సీఎం రేవంత్ రెడ్డి.. పీఏసీ మీటింగ్‌లో ఫైనల్ టచ్ ఇచ్చారు. గాంధీభవన్‌లో ఇంకోసారి ధర్నాలు చేయొద్దన్నారు. పదవులు అడగడం తప్పుకాదన్నారు. అలాగని పదవుల కోసం ధర్నాలు చేస్తే కఠినచర్యలు ఉంటాయన్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి పీసీసీ దృష్టికి తీసుకురావాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలోనూ తమకే టికెట్ దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్న కొందరు నేతలకు చురకలంటించారు ముఖ్యమంత్రి. ఎవరికి వారు తామే అభ్యర్థులమని ప్రకటించుకోవద్దన్నారు. హైకమాండ్ మార్గదర్శకాల మేరకు పనిచేసే నేతలకు, కార్యకర్తలకే పార్టీలో భవిష్యత్ ఉంటుందంటూ కొంచెం గట్టిగానే హెచ్చరించారు రేవంత్ రెడ్డి.