తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. స్వరాష్ట్రంలో పదేళ్లుగా ఎదురే లేదనుకున్న గులాబి పార్టీని ఓడించి, తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అంతే దూకుడుగా రేవంత్ రెడ్డి పాలనలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం. ప్రపంచవ్యాప్తంగా సవాలుగా మారుతోన్న వాతావరణ మార్పులను అధిగమించేందుకు రేవంత్ రెడ్డి ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పునరుద్ధరణ, పునరుత్పాదక ఇంధనం తోపాటు తెలంగాణకు పచ్చదనం భవిష్యత్ తరాలకు అందించేందుకు కీలక ముందడుగు వేశారు.
పర్యావరణ పునరుద్ధరణలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ముఖ్యమైన ప్రాజెక్టుల్లో సరస్సులు, చెరువుల పునరుద్దరణ ప్రధానమైంది. ఒకప్పుడు చెరువులకు, సరస్సులకు పెట్టింది పేరైన భాగ్యనగరంలో కబ్జాల కారణంగా చెరువులు, కుంటలు కుదించుకుపోయి, ఉనికిని కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే హైడ్రా పేరుతో ప్రత్యేక వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీంతో చెరువుల్లోని అక్రమ కట్టడాలను పని పడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరు 75 చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు.
హైదరాబాద్ మహానగరం పరిధిలోని మొత్తం 2000 చెరువుల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా నిర్జీవమైన నీటి వనరులను పునరుద్ధరించనున్నారు. జీవవైవిధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు భూగర్భ జలాలు నిండేలా ప్రణాళికలు చేస్తున్నారు. వలస పక్షులను తిరిగి తెలంగాణ గడ్డపై విహారించేలా ఫ్లాన చేస్తున్నారు. చెరువులకు కొత్త శోభ తీసుకురావడంతో ఫ్లెమింగోలు, రెడ్ బ్రెస్టెడ్ ఫ్లైక్యాచర్ వంటి జాతులకు చెందిన పక్షులు తిరిగిరావాలని భావిస్తున్నారు. పర్యావరణ పునరుద్ధరణతో పాటు మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూర్చనుందని ప్రకృతి ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.
జీవ వైవిధ్యానికి సరైన చిరునామా అమీన్‌పూర్ చెరువు. రకరకాల పక్షులు, జంతువులకు నిలయం ఇది. ఏకంగా 350 ఎకరాల్లో విస్తరించిన అమీన్‌పూర్ చెరువు.. పెద్దచెరువు, కొత్తచెరువు, కొమ్ముచెరువు అనే మూడు చెరువుల గొలుసుకట్టు. ఇంత పెద్ద చెరువును కబ్జాలకు గురైంది. పెద్ద చెరువు నుంచి తూముల ద్వారా వచ్చే నీటిని సైతం కబ్జాదారులు మూసివేశారు. కొత్త చెరువును దాదాపు ఆనవాళ్లు లేకుండా చేశారు. ఈ మధ్య పెద్ద చెరువుకు సబంధించిన అలుగు, తూములు మూసివేయడంతో వర్షం వచ్చినప్పుడు ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందిపడుతున్నారు అమీన్‌పూర్ వాసులు. దీనికితోడు పశుపక్షాదులకు నిలయమైన అమీన్‌పూర్ వలస పక్షులు అంతరించిపోతున్నాయి. చెరువు వద్దకు రావడమే మానేశాయి.
ఈ నేపథ్యంలో చెరువుల పరిరక్షణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. పర్యావరణాన్ని కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలని సంకల్పించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమీన్‌పూర్ చెరువు వద్ద కనిపించిన అరుదైన రెడ్ ఫ్లైక్యాచర్‌కు సంబంధించిన చిత్రాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. పర్యావరణ పునరుద్ధరణ కోసం సాగుతోన్న కార్యక్రమాలకు ఇది సాక్ష్యమని సీఎం ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అమీన్ పూర్ చెరువుకు పూర్వవైభవం రావటమే కాకుండా.. జీవ వైవిద్యం కూడా తిరిగి సంతరించుకుంది. ఇందుకు నిదర్శనమే.. ఫ్లైక్యాచర్ లాంటి అరుదైన జాతి పక్షులు ఇక్కడికి విచ్చేయటమే అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
కాగా.. అమీన్‌పూర్ చెరువు ఒకప్పుడు ఫ్లెమింగో పక్షులతో పాటు ఇతర జాతి పక్షులకు ఆవాసంగా ఉండేది. మారిన వాతావరణ పరిస్థితులు, ఆక్రమణలు, ఇలా రకరకాల కారణాలతో కొన్నేళ్లుగా పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటోంది అమీన్ పూర్ చెరువు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో వచ్చిన హైడ్రాతో ఈ చెరువుకు మరోసారి పునరుజ్జీవం వచ్చినట్లైంది.