దేశవ్యాప్తంగా తెలుగు వెలగాలంటే సుదర్శన్ రెడ్డి గెలవాలి.. సీఎం రేవంత్ కీలక కామెంట్స్

నీలం సంజీవ‌రెడ్డి , పీవీ న‌ర‌సింహ‌రావు, జైపాల్ రెడ్డి ,వెంక‌య్య నాయుడు, ఎన్టీఆర్ వంటి తెలుగు నేత‌లు గతంలో జాతీయ స్థాయిలో కీల‌క పాత్ర పోషించారని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పుడు మరోసారి తెలుగు వ్యక్తికి జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చిందని.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

ఎజెండా, జెండా లేకుండా ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డికి అంతా మ‌ద్ద‌తివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో తెలుగు భాష‌ రెండో స్థానంలో ఉన్న‌ప్పుడు తెలుగువారు కూడా ఆ స్థాయిలో ఉండాలన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఆత్మ ప్ర‌భోదానుసారం ఓటు వేయాల‌ని విజ్ఞప్తి చేశారు. జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి గెలిస్తే తెలుగు వారి ప్ర‌తిష్ట పెరుగుతుందని.. తెలుగు వారి గౌర‌వం పెరిగేలా .. అంద‌రూ ఒక తాటిపైకి వ‌చ్చి సుద‌ర్శ‌న్ రెడ్డి కి అండ‌గా నిలబడాలన్నారు. సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. సుదర్శన్ రెడ్డిని అభినందించేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డిని ఓ నాయ‌కుడు న‌క్స‌లైట్ అని అంటున్నారని.. న‌క్స‌లిజం ఒక విధానం మాత్రమేనని సీఎం రేవంత్ అన్నారు. న‌క్స‌లిజం ఫిలాస‌ఫి అందరికీ నచ్చకపోవచ్చని.. మ‌న‌కు న‌చ్చ‌ని ఫిలాస‌ఫితో వాదించి గెల‌వాలి.. కాని అంతం చేస్తానంటే కుద‌ర‌దని పరోక్షంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను విమర్శించారు. జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డికి సుదీర్ష అనుభ‌వం ఉందని.. ఆయ‌న వివిధ హోదాల్లో రాజ్యంగ స్పూర్తితో ప‌నిచేశారని చెప్పారు. రాజ్యాంగాన్ని ర‌క్షించే పార్టీలో ఆయ‌న మొద‌టి స‌భ్య‌త్వం తీసుకున్నారని.. రాజ్యాంగాన్ని ర‌క్షించ‌డ‌మే ఆయ‌న పార్టీ అని అన్నారు. రాజ్యాంగాన్ని ర‌క్షిస్తే దేశాన్ని ర‌క్షించిన‌ట్లే.. లేకుంటే దేశానికి న‌ష్టం జ‌రుగుతుందని చెప్పారు.

పెద్ద‌ల స‌భ‌ చైర్మ‌న్ సీటులో గౌర‌వ‌మైన వ్య‌క్తులు, అంబేద్కర్ విధానాల‌పైన‌ సంపూర్ణ విశ్వాసం ఉన్న‌వారు కూర్చుంటే దేశానికి మంచి జ‌రుగుతుందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. 18 ఏళ్ల కు ఓటు హ‌క్కు ఇచ్చిన రాజీవ్ గాంధీ ఆలోచ‌న‌ ఒక వైపు.. ఓట్ చోర్ ఆలోచ‌న‌తో మ‌రో పార్టీ ఇంకో వైపు ఉన్నాయని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాల‌ని, రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేయాల‌ని ఎన్డీఏ కూట‌మి.. రాజ్యాంగాన్ని, రిజ‌ర్వేష‌న్ల‌ను, ప్ర‌జాస్వామ్యాన్ని ర‌క్షించుకోవాల‌ని ఇండియా కూట‌మి ఎన్నిక‌ల బరిలోకి దిగాయని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇండియా కూట‌మి ఆలోచ‌న‌ను జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి గౌర‌వించి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారని.. సుద‌ర్శ‌న్ రెడ్డి పోటీతో ఎన్డీఏ కూట‌మికి ఇండియా కూట‌మి గ‌ట్టి పోటీ ఇస్తోందని చెప్పారు.

About Kadam

Check Also

కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావుది కీలక పాత్ర.. వారిద్దరి వల్లే కేసీఆర్‌కు అవినీతి మరకలు.. కవిత సంచలన ఆరోపణలు..

కాళేశ్వరం అవినీతిలో మాజీ మంత్రి హరీశ్ రావు పాత్ర కీలకమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. అందుకే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *