తీవ్రమైన చలితో హైపోథెర్మియా వంటి వ్యాధులు.. వైద్యుల హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలపై చలిపులి..పంజా విసురుతోంది. ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.

ఆదిలాబాద్‌లో కనిష్టంగా 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత

ఆదిలాబాద్‌లో కనిష్టంగా 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా..అల్లూరి జిల్లా మినుములూరులో 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డయింది. నిర్మల్‌లో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా సాధారణం కన్నా 5.5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌, కుమ్రంభీమ్‌ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది..వాతావరణశాఖ. మరోవైపు మెదక్‌ జిల్లా గతంతో పోలిస్తే చలితీవ్రత పెరిగిందని చెబుతున్నారు..స్థానికులు.

ఇక హైదరాబాద్ నగరంలోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 14 డిగ్రీల సెల్సియస్‌కు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో చలిపులి పంజా విసురుతోంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు..వాతావరణశాఖ అధికారులు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని..ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని చెబుతున్నారు.

తీవ్రమైన చలితో హైపోథెర్మియా వంటి వ్యాధులు

తీవ్రమైన చలితో హైపోథెర్మియా వంటి వ్యాధులు వచ్చే అవకాశముంది. దీంతో గర్భిణిలు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవాళ్లు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు వైద్యులు. చలి తీవ్రతతో ఇంట్లో కర్రలు, బొగ్గుల కుంపటి వెలగించడం వంటివి చేయవద్దని.. దీని వల్ల కార్బన్ మోనాక్సైడ్ ప్రభావంతో అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీగా పెరిగింది చలి తీవ్రత. ఓవైపు దట్టంగా కురుస్తున్న పొగమంచు..మరోవైపు ఎముకలు కొరికే చలితో గిరిజనుల అవస్థలు పడుతున్నారు. ఇక ఈ పొగమంచులో ఏజెన్సీ అందాలను చూసేందుకు..భారీగా తరలివస్తున్నారు..పర్యాటకులు. స్థానికంగా టెంట్లు వేసుకొని చలిమంటలతో సేదతీరుతున్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో తెలుగురాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతాయని అంచనా. అయితే, రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు..వాతావరణ నిపుణులు. సో..బి అలర్ట్..!

About Kadam

Check Also

కొమురంభీమ్‌ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులి

అమృతగూడ గ్రామం వద్ద గురువారం రోడ్డుపై పులి కనిపించడంతో కలకలం రేగింది. అమృతగూడ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. గ్రామ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *