డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాల్సిందే.. అన్ని పార్టీల నుంచి పెరుగుతున్న డిమాండ్!

భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల..పార్టీలకు అతీతంగా రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మన్మోహన్‌ సింగ్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపుతున్నారు. ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్‌ సింగ్‌ను దేశం గుర్తుంచుకుంటుందని కొనియాడుతున్నారు. మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఆయన మృతికి సంతాప సూచికంగా 7 రోజులు సంతాప దినాలుగా పాటిస్తోంది.

దేశ ఆర్థిక ప్రగతిని పట్టాలెక్కించిన మాజీ ప్రధాని, ప్రముఖ‌ ఆర్థిక‌వేత్త మన్మోహన్‌ సింగ్‌ మరణం పట్ల.. దేశం యావత్తూ ఘననివాళి అర్పిస్తోంది. ఆర్థిక సంక్షోభం నుంచి భారత్‌ను గట్టెక్కించడమే కాకుండా.. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా దేశాన్ని నిలిపిన మన్మోహన్‌ సేవలను.. స్మరించుకుంటున్నారు. దేశానికి సరికొత్త దశ, దిశ చూపిన ప్రధానిగా చరిత్రలో నిలిచిపోతారంటూ మన్మోహన్‌సింగ్‌ను కొనియాడుతున్నారు.  ఈ క్రమంలోనే మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలో మన్మోహన్‌సింగ్‌కు నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

మాజీ ప్రధాని పేరు చెబితేనే దేశంలో ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు గుర్తుకు వస్తాయని, దేశానికి ఆయన అందించిన సేవల వల్లే భారతరత్నకు అర్హుడని భావిస్తున్నానన్నారు మల్లు రవి. ఆర్థికవేత్తగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారన్నారు. ప్రధానిగా ప్రపంచమంతా గౌరవించే వ్యక్తి అయిన ఆయనకు కచ్చితంగా భారతరత్న రావాలన్నారు.

ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించారు. పదేళ్లపాటు ప్రధానిగా, దేశ ఆర్థికమంత్రిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా దేశానికి మన్మోహన్ సింగ్ ఎంతో కృషి చేశారని ఆప్ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ అన్నారు. అతను ఖచ్చితంగా భారతరత్న అందుకోవడానికి అర్హుడన్నారు. మన్మోహన్‌ సింగ్‌తో కలిసి రాజ్యసభలో ఇన్నేళ్లు ఉండే అవకాశం నాకు దక్కింది. ఒక సంఘటన మర్చిపోలేనన్నారు. ఆయన సభలో మాట్లాడేందుకు లేచి నిలబడినప్పుడల్లా అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా అందరూ ఆయన మాటలను చాలా శ్రద్ధగా వినేవారు. ఈరోజు అతను మన మధ్య లేడు. ఆయనకు నా తరపున, పార్టీ తరపున నివాళులు అర్పిస్తున్నాను. అంటూ సంజయ్ సింగ్ ఎమోషనల్ అయ్యారు.

ఇక మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని గతంలో కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా చెప్పడం గమనార్హం. పార్టీ సమావేశంలో కూడా ఈ డిమాండ్‌ను ముందుకు తీసుకురావడం జరిగింది.

About Kadam

Check Also

అనుమానంతో కారులో అణువణువు తనిఖీ.. కనిపించింది చూసి ఖాకీలు స్టన్..

ఓ వ్యక్తి కారులో దర్జాగా వస్తున్నాడు.. మనకు తిరుగులేదేలే అంటూ రయ్యిరయ్యిన దూసుకువస్తున్నాడు.. ఈ క్రమంలోనే.. పోలీసులు ఎంటర్ అయ్యారు.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *