బ్యాంక్‌ నిండా లక్కీ భాస్కర్లే..! కోఆపరేటివ్ బ్యాంకులో లక్షలకు లక్షలు మింగేశారు.. చివరకు..!

ఆత్మకూరు కేంద్ర సహకార బ్యాంకులో కోట్ల రూపాయలు మాయమైన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. ఉద్యోగులు, అధికారులు బ్యాంకు నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా, నాగంపల్లి సొసైటీ సీఈవో కోటేశ్వరరావు రూ.40 లక్షలు దారి మళ్లించినందుకు సస్పెండ్ అయ్యారు. ఈ ఘటనలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.

చాలా మంది లక్కీ భాస్కర్‌ సినిమా చూసే ఉంటారు. అందులో హీరో ఓ బ్యాంక్‌లో పనిచేస్తూ.. తన అవసరాల కోసం బ్యాంక్‌లో డబ్బును అడ్డదారిలో తీసుకెళ్లి, తన అవసరాలును తీర్చుకొని.. మళ్లీ తీసుకొచ్చి బ్యాంక్‌లో పెట్టేస్తాడు. ఇలాంటి స్కామ్‌లు సినిమాల్లోనే కాదు.. రియాల్‌గా కూడా చాలా జరుగుతున్నాయి. అందుకు నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని కేంద్ర సహకార బ్యాంకు ప్రత్యక్ష ఉదాహరణ. ఉద్యోగులు అధికారులు ఎవరికి తోచినంత వారు బ్యాంకు డబ్బులు మాయం చేస్తున్నారు. జరిగిన విషయం గోప్యంగా ఉంచుతారు. అంతా పూర్తి చేసుకుని సస్పెండ్ చేసిన తర్వాత బయటకు చెబుతున్నారు. అసలు ఏం జరుగుతుందో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. తాజాగా కొత్తపల్లి మండలం నాగంపల్లి సొసైటీ సీఈవో కోటేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. అంతకు ముందు కూడా ఇలాగే జరిగింది.

రైతులు పెద్ద ఎత్తున కోట్ల రూపాయల్లో ఈ బ్యాంకులో డిపాజిట్లు చేశారు. అదేవిధంగా మరికొందరు రైతులు పంటల సాగు కోసం రుణాలు తీసుకున్నారు. ఒక్క ఉమ్మడి కర్నూలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో రూ.3 వేల కోట్ల టర్నవర్ ఉందంటే ఆ బ్యాంక్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంత పెద్ద ఎత్తున రైతులతో మమేకమైన బ్యాంకులో లక్షలకు లక్షలు మాయమవుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం అవుతుంది.

ఆత్మకూరు కేంద్ర సహకార బ్యాంకులో గత డిసెంబర్‌లో రూ.90 లక్షల నగదు నిధులు మాయం అయ్యాయి. క్యాషియర్ అల్తాఫ్ హుస్సేన్, అసిస్టెంట్ మేనేజర్ రంగయ్య లను విధుల నుంచి తొలగించారు. వారి నుంచి రికవరీ రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రైతులు మరిచిపోక ముందే కొత్తపల్లి మండలం నాగంపల్లి సొసైటీ బ్యాంకులో రైతుల ఖాతాల నుంచి రూ.40 లక్షలు దారి మళ్లించి సీఈవో కోటేశ్వరరావు సొంతానికి వాడుకున్నారు. లెక్క తేలకపోవడంతో అధికారులు నిలదీయడంతో గుట్టురట్టయింది. వెంటనే కోటేశ్వరరావును సస్పెండ్ చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి సీఈఓ ల మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా కేంద్ర సహకార బ్యాంక్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఎక్కడెక్కడ అవినీతి ఆరోపణలు వచ్చాయో వారందరినీ గుర్తించి వారి విధుల పట్ల కదలికల పట్ల నిఘా పెట్టారు. పోయిన నిధులను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

About Kadam

Check Also

అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఇంత దారుణమా.. ఏకంగా 10 మందితో కలిసి..

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించమని గట్టిగా అడిగినందుకు ఒక వ్యక్తి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *