ఇద్దరి మనసులు కలిశాయి. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనుకున్నట్లుగానే రెండు నెలల క్రితం వారు ఉంటున్న ఇంటి ఓనర్ సహాయ సహకారాలతో ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆరు నెలల క్రితం రమ్యశ్రీకి కూడా నిఖిల్ రెడ్డి చేస్తున్న కెమికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించాడు.
తమకు నచ్చినవారితో జీవితం కొనసాగించాలని ప్రేమ వివాహం చేసుకుని.. తమ జీవితాన్ని ఎంతో హాయిగా గడపాలని ఎన్నెన్నో కలలు కన్న ఒక జంట.. వివాహమైన రెండు నెలలకే వారి జీవితాలకు చివరి రోజులు వచ్చేస్తాయని ఊహించలేకపోయారు. ఒకే చోట పని చేస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ వివాహం చేసుకుని ప్రమాదంలో ఇద్దరూ ఒక్కటిగానే తనువు చాలించారు.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ ముద్దనూరుకు చెందిన నిఖిల్ రెడ్డి.. అలాగే ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం పుట్రెల గ్రామానికి చెందిన శ్రీ రమ్య గత రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు గత ఏప్రిల్ నెల 20వ తేదీన హైదరాబాద్‌లోని ఆర్య సమాజంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాతి రోజు తన భార్యను తీసుకుని కడప జిల్లాలోని తన సొంత ఊరుకు వచ్చి తల్లిదండ్రులను కలిసి తన భార్యను పరిచయం చేసిన నిఖల్ కుమార్ రెడ్డి వారి ఆశీస్సులు తీసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లారు.
అంతేకాకుండా ఈ ఆషాడం అయిపోయిన తర్వాత అమ్మాయి, అబ్బాయి బంధువులతో కలిసి చిన్న ఫంక్షన్ కూడా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. కానీ వారి ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. ప్రేమ వివాహం జరిగిన రెండు నెలలకే సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘోరమైన ఘటన నిఖిల్ రెడ్డి, శ్రీ రమ్య కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది.