జాయింట్ సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2024 పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ పరీక్షలు ఫిబ్రవరి 28, మార్చి 1, 2వ తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. పరీక్షకు మూడు రోజుల ముందు నుంచి అడ్మిట్ కార్డులు అందుబాటులోకి తీసుకువస్తారు. సైన్స్ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రతీయేట ఈ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షలో అర్హత సాధించవల్సి ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లలో, యూనివర్సిటీల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దేశంలోని ఏ యూనివర్సిటీ లేదా కాలేజీలోనైనా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కొలువు దక్కించుకునేందుకు అర్హత సాధించవచ్చు.