ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. టెక్నాలజీతో పాటు సైబర్ నేరాల కూడా వేగంగానే పెరుగుతున్నాయి. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ దాడులు జరగడం అనేది నేడు సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా ఇలానే ఓ రైతు తన ఫోన్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేయడంతో తన బ్యాంక్ ఖాతాలోని డబ్బులు పొగొట్టుకున్నాడు. కాగా ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అవేంటో తెలసుకుందాం పదండి..
ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ ల వినియోగం పెరగడంతో సోషల్ మీడియా ఖాతాలైన వాట్సాప్, టెలిగ్రామ్‌లలో తెలియని మొబైల్ ఫోన్ నంబర్లు, గ్రూపుల నుండి APK (Android Package) (ఉదా: PM KISAN YOJANA no009.apk, ICICI Bank Credit Card Apply.apk, SBI ekyc.apk, YonoSBI.apk) ఫైల్స్ తరచుగా వస్తున్నాయి. కొన్ని APK ఫైల్స్‌లో మాల్వేర్ (Malware), స్పైవేర్ (Spyware) లేదా ట్రోజన్ (Trojan) కోడ్‌లు ఉంటున్నాయి. యూజర్ తెలియకుండా APK (Android Package) ఫైల్స్‌ను క్లిక్ చేస్తే. వెంటనే వారి ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ అకౌంట్ డిటైల్స్, పాస్వర్డ్స్, కాంటాక్ట్స్, మెసేజ్‌లు, గ్యాలరీ ఫైల్స్ వంటి వ్యక్తిగత డేటా హ్యాకర్ల చేతిలోకి వెళ్తున్నాయి. వాళ్ళు ఒకే ఒక్క క్లిక్‌తో యూజర్స్ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తాన్ని ఖాళీ చేయడంతో పాటుగా మొబైల్లో ఉన్న వ్యక్తిగత సమాచారం ఆధారంగా బ్లాక్ మెయిలింగులకు దిగుతున్నారు.
తాజాగా ఇలానే ఓ రైతు తన ఫోన్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేయడంతో తన బ్యాంక్ ఖాతాలోని డబ్బులు పొగొట్టుకున్నాడు. సత్యసాయి జిల్లా కనగానిపల్లి ప్రాంతానికి చెందిన ఒక రైతు వాట్సప్‌కు కేంద్ర ప్రభుత్వ పథకం అయిన PM Kissan Yojana పేరుతో నకిలీ APK ఫైలు రాగా ఆ రైతు దానిని అధికారిక యాప్‌గా భావించి డౌన్లోడ్ చేయడంతో ఆ రైతు యొక్క SBI బ్యాంకు ఖాతా నుండి 94,000 రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేషార్. దీంతో మోసపోయిన బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.
సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- ప్రమాదకర APK ఫైల్స్ ను డౌన్‌లోడ్ చేయవద్దు.
- గూగుల్ ప్లే స్టోర్ నుండి మాత్రమే యాప్ లను డౌన్లోడ్ చేసుకోవాలి.
- యాప్ అనుమతులను పూర్తిగా పరిశీలించడం. ఒక యాప్‌కు అవసరం లేని పర్మిషన్‌లు ఇవ్వవద్దు
- మీ ఫోన్‌లో గూగుల్ ప్లే ప్రొటెక్షన్‌ను Play Store → Play Protect → Settings → Scan apps with Play Protect ను ఆన్ చేసి ఉంచండి.
- ఆధునిక యాంటీ వైరస్/మొబైల్ సెక్యూరిటీ అప్లికేషన్‌లను ఇన్స్టాల్ చేసుకోవడం. Avast, Norton, Bitdefender వంటి నమ్మదగిన యాంటీ వైరస్ యాప్‌లను మొబైల్‌లో ఇన్ స్టాల్ చేసుకోవడం.
- బ్యాంకింగ్ యాప్‌లు ఉపయోగిస్తున్నప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, అధికారిక బ్యాంకింగ్ యాప్ లతో మాత్రమే లావాదేవీలు జరపడం.
ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండి, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా ఉండటం, అపరచితుల నుండి వచ్చిన ఫోన్ కాల్స్ కు స్పందించకుండా ఉండటం, బ్యాంకింగ్ లేదా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకుండా అప్రమత్తతతో వ్యవహరిస్తేనే సైబర్ నేరాలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు సైబర్ పోలీసులు. ఎవరైనా సైబర్ క్రైమ్ బారినపడితే వెంటనే 1930 హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేయడం లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయవలసిందిగా కోరుతున్నారు.