సోమవారం ఒక్కరోజే రెండు విమానాల్లో సాంకేతిక సమస్య ఏర్పడగా.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించారు. రెండు ఘటనల్లోనూ ప్రయాణీకులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి షిల్లాంగ్ బయలుదేరిన ఓ ప్రైవేటు విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. గగనతలంలో స్పైస్ జెట్ విమానం ఓ పక్షిని ఢీకొంది. దీంతో విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో పట్నాలోని జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని ఉదయం 8.52 గంటంలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించారు. విమానంలోని ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారు. ప్రయాణీకులను షిల్లాంగ్‌కు పంపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
కాగా చెన్నై నుంచి కొచ్చి బయలుదేరిన వెళ్లిన మరో విమానంలో సాంకేతిక సమస్య ఉత్పన్నమయ్యింది. విమానం చెన్నై నుంచి బయలుదేరి కాసేపటికే అందులో సాంకేతిక సమస్య ఉన్నట్లు పైలట్ గుర్తించారు. ఆ మేరకు చెన్నై విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో ఈ విమానాన్ని వెనక్కి తిప్పించి చెన్నై విమానాశ్రయంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించారు. ఆ సమయంలో విమానంలో 117 మంది ప్రయాణీకులు ఉన్నారు. విమానం సేఫ్ ల్యాండింగ్ కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణీకులను మరో విమానంలో కొచ్చి పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.
రెండు ఘటనల్లోనూ సాంకేతిక సమస్యలకు కారణాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.