ఆపరేషన్‌ సిందూర్‌తో భారత ఆయుధాలకు పెరిగిన డిమాండ్.. “ఆకాశ్” క్షిపణి వ్యవస్థతో పాటు “గరుడ” ఫిరంగులపై బ్రెజిల్ ఆసక్తి!

గత కొన్ని దశాబ్దాలుగా రక్షణ పరికరాలు, ఆయుధాల గురించి ప్రస్తావన వస్తే అమెరికా, రష్యా వంటి అగ్రరాజ్యాలు గురించే చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు ఆ జాబితాలో ప్రపంచంలోనే జనాభాలో అతిపెద్ద దేశంగా, ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానంలో ఉన్న భారత్ గురించి చెప్పుకుంటున్నారు. అందుకు కారణం పాకిస్థాన్‌లోని ఉగ్రవాదు శక్తులను మట్టికలిపించేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్. ఉన్న స్థలం నుంచే పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తీరుతో..ఈ ఆపరేషన్‌లో భారత్‌ ఉపయోగించిన ఆయుధాలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. ఇదే ఇప్పుడు భారత్‌కు సరికొత్త అవకాశాలను తెచ్చిపెడుతోంది.

మార్కెట్లోకి ఏదైనా వస్తువు వచ్చిందంటే దాని పనితీరు గురించి ఆకట్టుకునే ప్రకటనలు అవసరమవుతాయి. ఒకవేళ ఆ ఉత్పత్తి నిజంగానే బాగుంటే ఎలాంటి ప్రకటనల అవసరం లేకుండా మౌత్ పబ్లిసిటీతోనే మార్కెట్‌ను చుట్టేస్తుంది. ఈ సూత్రం కేవలం వినియోగదారుల వస్తువులకే కాదు.. దేశాల రక్షణ కోసం వినియోగించే ఆయుధాలకు కూడా వర్తిస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా రక్షణ పరికరాలు, ఆయుధాల గురించి ప్రస్తావన వస్తే అమెరికా, రష్యా వంటి అగ్రరాజ్యాలు, సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఇజ్రాయెల్, జర్మనీ, జపాన్, చైనా, కొరియా వంటి దేశాల గురించే చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు ఆ జాబితాలో ప్రపంచంలోనే జనాభాలో అతిపెద్ద దేశంగా, ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానంలో ఉన్న భారత్ గురించి చెప్పుకోవాల్సి వస్తోంది. ఇందుకు కారణం ఈ మధ్య పాకిస్తాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో భారత్ చేపట్టిన “ఆపరేషన్ సింధూర్” ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చనీయాంశంగా మారింది.

తక్కువ ఎత్తులో రాడార్ కంటికి చిక్కకుండా ప్రయోగించే డ్రోన్ల నుంచి ఆకాశమార్గంలో ప్రయోగించే క్షిపణులు, ఫైటర్ జెట్ల వరకు అన్నింటినీ భారత్ సమర్థవంతంగా ఎదుర్కోవడం ఒకెత్తయితే.. సొంత శాటిలైట్ సమాచారంతో పక్కాగా.. నిక్కచ్చిగా శత్రు సైనిక, ఉగ్రవాద స్థావరాలను గుర్తించి.. వాటిని మాత్రమే ధ్వంసం చేయడం భారత్ శక్తి, సామర్థ్యాలకు మచ్చుతునకగా నిలిచాయి. ఈ పరిస్థితుల్లో భారత్ ఈ ఆపరేషన్‌లో ఉపయోగించిన ఆయుధాలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. ఎయిర్ డిఫెన్స్‌లో రష్యా అందించిన S-400తో పాటు భారత్ సొంతంగా సమకూర్చుకున్న “ఆకాశ్” క్షిపణి వ్యవస్థ అత్యంత కీలకంగా మారిందన్న విషయం తెలిసిందే. బ్రెజిల్ తాజాగా ఆకాశ్ క్షిపణులతో పాటు భారత్ తయారీ “గరుడ” ఫిరంగి వ్యవస్థను కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తోంది.

రక్షణ సహకారానికి సంబంధించి భారతదేశం, బ్రెజిల్ మధ్య కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. భారతదేశంలో తయారు చేసిన ‘ఆకాశ్’ వాయు రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయడానికి బ్రెజిల్ అమితాసక్తిని కనబరిచింది. ఇది DRDO అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణ 45 కిలోమీటర్ల దూరం వరకు వాయుమార్గం నుంచి వచ్చే శత్రు దేశ క్షిపణులు, యుద్ధ విమానాలను ధ్వంసం చేస్తుంది. దీన్ని మీడియం రేంజ్ సర్ఫేస్ (ఉపరితలం) టూ ఎయిర్ (గగనతలం)మిస్సైల్ సిస్టమ్‌గా వ్యవహరిస్తారు. పాకిస్తాన్ ప్రయోగించిన అనేక క్షిపణులను, ఫైటర్ జెట్లను గాల్లోనే ధ్వంసం చేయడంలో ఆకాశ్ అత్యంత సమర్థవంతంగా పనిచేసింది. ఆకాశ్ పనితీరును యావత్ ప్రపంచం ప్రత్యక్షంగా గమనించింది. యుద్ధ క్షేత్రంలో ఆయుధం పనితీరును మించిన అడ్వర్టైజ్‌మెంట్ మరొకటి ఉండదు. ఇప్పుడు అదే జరిగింది.

మోదీ బ్రెజిల్ టూర్‌లో కీలక ఒప్పందం..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2025 జూలై 5 నుంచి 8 మధ్య బ్రెజిల్ పర్యటనలో ఉంటారు. ఈ సమయంలో రెండు దేశాల మధ్య ఒక ప్రధాన రక్షణ ఒప్పందం జరగనుంది. ఇది భారతదేశం-బ్రెజిల్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త బలాన్ని ఇస్తుంది. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం శత్రువుల వైమానిక దాడులను భగ్నం చేస్తూ.. ‘ఆకాశ్’ వంటి స్వదేశీ వ్యవస్థలు ఏదైనా సవాలును పూర్తిగా ఎదుర్కోగలవని నిరూపించింది. అందుకే ఇతర దేశాలు కూడా భారత రక్షణ వ్యవస్థలోని “ఆకాశ్”పై నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నాయి. ప్రస్తుతం, ‘ఆకాశ్’ వ్యవస్థను భారత సైన్యం, వైమానిక దళంలో మోహరించారు. బ్రెజిల్ దీనిని కొనుగోలు చేస్తే, అది భారతదేశ రక్షణ సాంకేతిక పరిజ్ఞానం ఎగుమతిలో కొత్త రికార్డు అవుతుంది. ఇది ప్రపంచానికి భారతదేశానికి సరికొత్త ఇమేజ్‌ను అందిస్తుంది.

దీనితో పాటు బ్రెజిల్ తన నావికా శక్తిని పెంచుకునే ప్రణాళికపై కూడా పనిచేస్తోంది. ఇందులో అణు జలాంతర్గాములు కూడా ఉన్నాయి. ఈ పరిస్థుల్లో భారత్-బ్రెజిల్ మధ్య జరిగే ఒప్పందం ప్రపంచంలోని మారుతున్న రక్షణ సమీకరణాలను ప్రతిబింబిస్తుంది. ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పుడు స్వదేశీ లేదా భాగస్వామ్య రక్షణ పరిష్కారాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం భారతదేశాన్ని నమ్మకమైన రక్షణ భాగస్వామి ఇమేజ్‌ను మరింత బలోపేతం చేసింది. ప్రపంచ ఆయుధ వ్యవస్థలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న పాశ్చాత్య దేశాలకు ఓరకంగా సవాల్ విసురుతోంది.

క్షిపణులే కాదు.. ఫిరంగులు కూడా..

ఆసక్తికరంగా, బ్రెజిల్ భారతదేశ ‘ఆకాశ్’ వైమానిక రక్షణ వ్యవస్థపైనే కాకుండా “గరుడ” ఫిరంగి వ్యవస్థపై కూడా ఆసక్తి చూపింది. తద్వారా ప్రపంచం భారతదేశ రక్షణ శక్తిని నిశితంగా గమనిస్తోందని అర్థమవుతోంది. స్వదేశీ సాంకేతికత బలంతో భారతదేశం రక్షణ రంగంలో మరో పెద్ద ముందడుగు వేసింది. భారత్ ఫోర్జ్ అభివృద్ధి చేసిన GARUDA 105 V2 ఫిరంగి వ్యవస్థ ఇప్పుడు అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ ఫిరంగిని విమానం నుంచి పారాడ్రాప్ చేయవచ్చు. తద్వారా దీనిని కొన్ని నిమిషాల్లో క్లిష్ట ప్రాంతాలలో కూడా మోహరించే వెసులుబాటు ఈ ఫిరంగులు ఉంది. 360 డిగ్రీల్లో ఆయుధాన్ని ప్రయోగించే వెసులుబాటు ఉంది. అలాగే దీన్ని ఒక ఆల్ టెర్రయిన్ వాహనంపై అమర్చడం వల్ల వేగంగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి సులభంగా తరలించవచ్చు.

“గరుడ” వ్యవస్థ భారతదేశం ఆత్మనిర్భర్ భారత్‌లో భాగం. 2016, 2018, 2020లో రక్షణ పరికరాల రూపకల్పన, తయారీ ప్రక్రియను సరళీకృతం చేస్తూ దేశీయంగా ఆయుధాలను తయారుచేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దేశ భద్రతను బలోపేతం చేయడంతో పాటు విదేశీ ఆయుధాలపై ఆధారపడటాన్ని తగ్గించడం దీని ఉద్దేశ్యం. స్వయం సమృద్ధి సాధించుకునే ప్రయత్నాలు కాస్తా.. భారత్‌ను ప్రపంచ పటంపై అధునాతన ఆయుధాలను అందించగల దేశంగా మార్చేస్తున్నాయి.

About Kadam

Check Also

మీకు ఇది తెల్సా.! రైల్వే ఛార్జీలు బాగా పెరిగాయ్.. కానీ లోకల్ ట్రైన్స్‌లో..

జులై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కొత్త రైల్వే ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. టికెట్ల బుకింగ్‌కు సంబంధించి కూడా కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *