హైదరాబాద్‌లోని కజకిస్తాన్ రిపబ్లిక్ కాన్సిలేట్ హెడ్ నవాబ్ మీర్ నాసిర్, ఆయన కుటుంబానికి తన అధికారిక నివాసంలో ప్రత్యేక విందు ఆతిధ్యాన్ని ఇచ్చారు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఈ సమావేశంలో భట్టి, నాసిర్ మధ్య ప్రస్తుత ప్రపంచ రాజకీయ, వాణిజ్య పరిణామాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అలాగే కజకిస్తాన్‌లో ఔషధ తయారీ కేంద్రం ఏర్పాటు కోసం హైదరాబాద్‌కు చెందిన MSN లాబొరేటరీస్, కజకిస్తాన్ ఇన్వెస్ట్ మధ్య ఇటీవల జరిగిన అవగాహన ఒప్పందం గురించి నాసిర్.. డిప్యూటీ సీఎంకు వివరించారు.
అటు కజకిస్తాన్‌లో వైద్య విద్యాసంస్థ, ఆసుపత్రి ఏర్పాటుకు సంబంధించి అపోలో హాస్పిటల్స్ గ్రూప్ CEO డాక్టర్ శ్రీనివాస్ రావుతో జరుగుతున్న చర్చలపై నాసిర్ ఓ అప్‌డేట్‌ను భట్టీ విక్రమార్కకు ఇచ్చారు. అంతేకాకుండా హైదరాబాద్, కజకిస్తాన్‌లోని అల్మట్టి మధ్య విమాన సర్వీసుల ప్రతిపాదనపై జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్‌లైన్ మార్కెటింగ్ హెడ్ ఆనంద ఆచార్యతో సమావేశం అయ్యానని.. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ఉప ముఖ్యమంత్రికి తెలిపారు నాసిర్.
హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకున్నా.. అందుకు పూర్తి సహాయసహకారాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే కజకిస్తాన్‌ను సందర్శించాలని మర్యాదపూర్వకంగా ఉపముఖ్యమంత్రిని నాసిర్ కోరారు. కాగా, తను, తన కుటుంబానికి ప్రత్యేక ఆతిధ్యాన్ని ఇచ్చినందుకు గానూ డాక్టర్ నాసిర్.. భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.