ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరలో జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లా కేంద్రాలకు వెళ్లి కబ్జాలు, దందాలపై అర్జీలు స్వీకరించి అధికారులతో సమీక్షించాలని పవన్ నిర్ణయించారు. తానే స్వయంగా జిల్లా కేంద్రాలకు వెళ్లి కలెక్టర్, జేసీల సమక్షంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తా అంటూ ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో భూ దందా బాధితులతో మాట్లాడుతానంటున్నారు. బాధితుల ఫిర్యాదులు పరిశీలిస్తానంటున్నారు. బాధితుల బాధలు తెలుసుకొని, పరిష్కారానికి భరోసా ఇస్తా అంటున్నారు. తన పర్యటనలో భాగంగా ముందు కాకినాడ, విశాఖపట్నం వెళ్లాలని పవన్ నిర్ణయించారు. భూ సమస్యలు ఎదుర్కొంటున్న బాధితులు కూటమి నేతల కారణంగా ఇబ్బందిపడ్డా ఉపేక్షించబోము అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో పాలన పారదర్శకంగా, నిష్పాక్షికంగా సాగుతుందని.. ఎవర్నీ వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు.
విశాఖ, కాకినాడ, కడప, తిరుపతి నుంచి జనసేన కార్యాలయానికి వచ్చిన అర్జీలపై అధికారులతో పవన్ టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆరా తీశారు. జిల్లాల పర్యటన, బాధితుల నుంచి అర్జీకి సంబంధించిన విషయాన్ని తానే స్వయంగా గ్రౌండ్‌లోకి దిగుతున్నట్లు ఈ సందర్భంగా పవన్ వారితో చెప్పారు. ఇటీవల కాలంలో భూకబ్జాలకు సంబంధించిన రాష్ట్రం నలుమూలుల నుంచి సమస్యలపై అర్జీలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు బాధితులు వచ్చి కలిస్తేనే అర్జీలు స్వీకరిస్తున్నారు, కానీ ఇక నుంచి భూసమస్యలపై తానే స్వయంగా జిల్లాలకు వెళ్లి అర్జీలు స్వీకరించేందుకు కసరత్తు చేస్తున్నారు పవన్. భూకబ్జాలకు పాల్పడితే ఎవరినైనా వదేలిది లేదంటన్నారు. ఇందుకు కూటమి నేతలు కూడా అతీతులు కారంటూ వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Amaravati News Navyandhra First Digital News Portal