ధరణి కంటే భూభారతి ఏ విధంగా గ్రేట్? రైతుల భూ సమస్యలన్నీ తీరుస్తుందా?

ధరణి ఓ అద్భుతం అన్నారు. ఎంతో కసరత్తు చేసి మరీ కొత్త చట్టం తీసుకొచ్చామన్నారు. కాని, క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా కనిపించింది. ధరణిని సెట్‌రైట్ చేస్తున్న కొద్దీ కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. మరి.. భూభారతి ఎలా ఉండబోతోంది? ఎలాంటి సమస్య లేకుండా పరిష్కారం లభిస్తుందా?

ధరణి.. ఇకపై భూ భారతిగా మారుతోంది. ధరణి స్థానంలో భూమాతను తెస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే.. భూ సమస్యల నివారణకు తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది. భూ దస్త్రాలు, యాజమాన్య హక్కుల చట్టం-2024 బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్‌ఓఆర్‌-2020 స్థానంలో కొత్తగా భూ భారతి బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది.

2 కోట్ల 76 లక్షల ఎకరాలు. ఇదీ తెలంగాణ భూభాగం. మరి ఇందులో ప్రభుత్వ భూమి ఎంతో ప్రభుత్వానికి తెలుసా..? కచ్చితంగా తెలీదు..! అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఓ వివాదం ఉంది. చిన్న గొడవ కాదు.. 5 లక్షల ఎకరాలకు సంబంధించింది అది. అంటే.. అటవీశాఖ కింద ఎంత భూమి ఉంది. రెవెన్యూ శాఖ కింద ఎన్ని ఎకరాలు ఉన్నాయో తెలీదన్నట్టేగా? ఆశ్చర్యం ఏంటంటే.. ఓ పదేళ్ల క్రితం భూమి అమ్మేసిన వ్యక్తికి.. సడెన్‌గా అతని పేరు మీదకి ఆ భూమే వచ్చి చేరింది. ఇది మ్యాజిక్‌ కాదు.. ఒక యదార్థం. భూమి తన పేరు మీదే ఉందనుకుని గుండెలపై చేతులు వేసుకుని హాయిగా నిద్రపోతున్న వ్యక్తికి.. సడెన్‌గా ‘మీ పేరు మీద అసలు భూమే లేదే’ అనే వార్త తెలిసింది. పోనీ ఎవరైనా కబ్జా చేశారా అంటే.. అదేం కాదు. కాని, అతని పేరు మీద భూమి లేదంతే..!

ఇలాంటి సమస్యలేం చిన్నవేం కావు. గుర్తుండే ఉంటుంది.. 2019లో తహశీల్దారు విజయ రెడ్డిపై పెట్రోల్‌ పోసి సజీవ దహనం చేశారు. కారణం.. భూ సమస్య. దిగుబడి రాక, అప్పులు తీర్చలేకనే రైతులు ఆత్మహత్య చేసుకుంటారనుకుంటాం. కానీ, వాటిలో ఒక కారణం.. భూ సమస్య. ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఎన్నో కారణాలుండొచ్చు. వాటిలో ఒక కారణం.. భూసమస్యే. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ భూసమస్యను ఎవరూ తీర్చలేకపోతున్నారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కాలంలో భూభారతి పేరుతో సర్వేకు ప్రయత్నించారు. ఆ తరువాత కేసీఆర్ హయాంలో ధరణి తీసుకొచ్చారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌ ఇప్పుడు భూభారతి తీసుకొచ్చింది. మరి ఇప్పటికైనా భూసమస్యలు తీరేనా? ఇంతకీ ధరణితో వచ్చిన ఇబ్బందులేంటి? భూభారతి చట్టంతో దొరికే పరిష్కారాలేంటి? డిటైల్డ్‌గా తెలుసుకుందాం..!

ధరణి పోర్టల్‌ కాదిక.. భూభారతి. అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని చెప్పింది. కాని, చాలా రాష్ట్రాల్లో భూమాత పేరు ఉండడంతో.. ‘భూభారతి’ని తీసుకొస్తున్నట్టు ప్రకటించింది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం. ఇందులో భాగంగానే.. ‘రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్-2020’ చట్టాన్ని రద్దు చేసి కొత్తగా RoR-2024 చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ RoR గురించి సింపుల్‌గా చెప్పుకోవాలంటే.. భూ యజమానులకు హక్కు కల్పించడం. ఆ హక్కును రికార్డుల్లోకి ఎక్కించడం. రికార్డుల్లో పేరు ఉందంటే.. ఇక ఆ భూమికి ఢోకా లేదనే అర్థం. అందుకే, RoR చట్టానికి అంత ప్రాధాన్యత.

ఇంతకీ కొత్త RoR చట్టంతో సమస్యలకు పరిష్కారాలకు దొరుకుతాయా అంటే.. కచ్చితంగా దొరుకుతాయనే అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. మరీ ముఖ్యంగా RoR-2020 కారణంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న రైతులు కొన్ని వేల మంది ఉన్నారు. కారణం.. RoR-2020 చట్టం ప్రకారం ఏదైనా భూసమస్యను కలెక్టర్‌ రిజెక్ట్‌ చేస్తే, ఇక అంతే.. సరాసరి కోర్టుకు వెళ్లాల్సిందే..! మరో ఆప్షనే లేదు.

ఉదాహరణకు.. ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్‌ జరిగితే, వెంటనే మ్యుటేషన్‌ కూడా జరిగిపోతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. పొరపాటున ఏదైనా తప్పు జరిగితే మాత్రం.. దానికి పరిష్కారం చూపే వ్యవస్థే లేదు. ఇదొక్కటనే కాదు.. చాలా సమస్యలకు పరిష్కారం చూపే వ్యవస్థలే లేవు. ఇది వరకు తహశీల్దారు దగ్గర భూసమస్య తేల్చుకునే వారు. అక్కడ కాకపోతే ఆర్డీవో దగ్గర. అక్కడా పరిష్కారం దొరక్కపోతే కలెక్టర్‌ దగ్గరికి వెళ్లేవారు. కాని, RoR-2020 ప్రకారం.. డైరెక్టుగా కలెక్టర్‌ దగ్గరికే వెళ్లాలి. అక్కడ పరిష్కారం దొరకకపోతే మాత్రం కోర్టుకే వెళ్లాల్సి ఉంటుంది.

ఇలా దాదాపు 3 లక్షల కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఒకసారి కోర్టుకు వెళ్లామంటే దాదాపుగా వారాలు, నెలల పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. ఒక్కోసారి ఆర్డర్‌ కోసం ఏళ్లపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. దీనికి తోడు కోర్టు ఫీజులు, లాయర్లకు ఫీజులు చెల్లించాలి. సాధారణ రైతుకు ఇదంతా తలకు మించిన భారం. యూజర్‌ ఫ్రెండ్లీ గవర్నెన్స్‌ ఉండాల్సిన చోట.. ఇంత జంఝాటం ఉండకూడదు. అందుకే, కొత్తగా RoR-2024 చట్టాన్ని తీసుకొచ్చామంటోంది రేవంత్‌ రెడ్డి సర్కార్.

భూముల రిజిస్ట్రేషన్లలో గానీ, మ్యుటేషన్‌ విషయంలో గానీ ఏదైనా వివాదం వస్తే.. అప్పీల్‌ చేసుకోవచ్చు. ఆ అప్పీల్‌లో న్యాయం జరగలేదనుకుంటే.. రివిజన్‌కు వెళ్లొచ్చు. సపోజ్.. తహశీల్దారులు, ఆర్డీవోలు తీసుకునే నిర్ణయాలపై అప్పీల్‌ కోసం కలెక్టర్‌ లేదా జాయింట్ కలెక్టర్‌ దగ్గరికి వెళ్లొచ్చు. మరోసారి అప్పీల్‌ చేసుకోవాలనుకుంటే.. చీఫ్‌ కమిషనర్ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్-CCLA దగ్గరికి వెళ్లొచ్చు. అప్పీల్‌లో గానీ, రివిజన్‌లో గానీ ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఆ ఆదేశాలను రాతపూర్వకంగా ఇవ్వాలి. ఇవన్నీ RoR-2020 చట్టంలో లేవు.

సో, అప్పీల్, రివిజన్‌కు అవకాశం ఇస్తే.. భూసమస్యలన్నీ దాదాపుగా పరిష్కారం అవుతాయంటున్నారు నిపుణులు. అదెలా అంటే.. ఇప్పటి వరకు డేటా ఎంట్రీలో చిన్న తప్పు దొర్లినా సరే.. వాటిని సవరించకుండా నేరుగా కోర్టులోనే తేల్చుకోండంటూ తహశీల్దార్లు, కలెక్టర్లు లిఖితపూర్వకంగా రాసిచ్చేవారు. సో, రైతులకు గానీ, సామాన్యులకు గానీ కోర్టుకు వెళ్లడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. కొత్త చట్టం RoR-2024 ప్రకారం.. కేవలం వారం రోజుల లోపే 2 లక్షల 36 వేల పెండింగ్‌ దరఖాస్తులకు క్లియరెన్స్ వచ్చేస్తుందని ప్రభుత్వ అధికారులు సైతం చెబుతున్నారు. RoR-2024 చట్టం వల్ల జరిగే అతిపెద్ద ప్రయోజనం ఇదే.

ఇక సాదాబైనామా దరఖాస్తుల క్లియరెన్స్ కోసం 9 లక్షల 36 వేల మంది ఎదురుచూస్తున్నారు. వీళ్లందరికీ.. మళ్లీ దరఖాస్తు చేసుకునే అవసరమే రాకుండా కొత్త చట్టం ప్రకారం పరిష్కారం చూపబోతున్నారు. అంతేకాదు.. సాదాబైనామాల విషయంలో ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే.. మళ్లీ అప్లికేషన్లను స్వీకరించే వెసులుబాటు కొత్త చట్టంలో కల్పించారు. పైగా ఈ సాదాబైనామాలపై నిర్ణయాధికారాలన్నీ ఇప్పటి వరకు కలెక్టర్ల దగ్గరే ఉండేవి. కొత్త చట్టం ద్వారా సాదాబైనామాల పరిష్కార అధికారాలు ఆర్డీవోలకు అందబోతున్నాయి. ధరణి వచ్చాక చాలా సమస్యలు పుట్టుకొచ్చాయి. పోర్టల్‌లో నమోదు చేసిన భూమి విస్తీర్ణానికి, అసలు భూ విస్తీర్ణానికి చాలా తేడా కనిపించింది. ఎప్పుడో భూమి అమ్మేసిన వారికి తిరిగి వాళ్ల భూమి వాళ్లకే వచ్చింది. డబ్బులిచ్చి కొనుక్కుని, రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తి చేసుకున్న వారి భూమి మాయం అయింది. ఇక సర్వే నెంబర్లలోనూ ధరణిలో లోపాలు కనిపించాయి. కొన్ని సర్వే నెంబర్లు అయితే.. ఏకంగా మాయం అయ్యాయి. ప్రభుత్వ భూములు, ప్రైవేట్‌ ఆస్తుల వివరాల నమోదులో కూడా చాలా తేడాలు కనిపించాయి. వీటన్నింటికీ కొత్త చట్టంతో పరిష్కారం లభించబోతోంది.

భూసమస్యలన్నింటికీ కారణం.. భూసర్వే చేయకపోవడం. ఆ ఒక్క సర్వే చేస్తే చాలు.. దాదాపుగా 99 శాతం భూసమస్యలన్నీ తీరిపోతాయి. మరి చేయొచ్చుగా..! చెప్పడం ఈజీనే.. చేయడం ఎంత కష్టమో తెలుసా. భూసర్వేను పర్ఫెక్టుగా చేయాలంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం.. కనీసంలో కనీసం రెండేళ్లు పడుతుంది. పైగా అధికార యంత్రాంగాన్ని కూడా పెద్ద ఎత్తున ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే, భూసర్వే విషయంలో ప్రతి ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో భూభారతి పేరుతో భూసర్వే చేయాలనుకున్నారు. 2018లో చంద్రబాబు ప్రభుత్వం భూసేవ పేరుతో సర్వే చేయించాలనుకున్నారు. కాని, అవేవీ పట్టాలెక్కలేదు. ఆశ్చర్యం ఏంటంటే.. ఇప్పటికీ నిజాం కాలంలో చేసిన భూస్వరేనే ఆధారం.

నిజాం పాలనలో షెత్వార్‌ పేరుతో 1936లో భూసర్వే చేశారు. ఇప్పటికి 84 ఏళ్లు దాటింది. అప్పటి నుంచి ఏ ఒక్క ప్రభుత్వం కూడా భూ సర్వేను పూర్తిస్థాయిలో జరిపించిందే లేదు. తెలంగాణలో భూముల సమస్యలకు ప్రధాన కారణం.. సరిహద్దు గొడవలే. రికార్డుల్లో ఒక విస్తీర్ణం ఉంటుంది, వాస్తవంలో విస్తీర్ణంలో తేడా ఉంటుంది. ధరణిలో ఎక్కువ శాతం పరిష్కారం కాని సమస్యలన్నీ ఇవే. సో, భూభారతి పేరుతో కొత్త పోర్టల్‌ తీసుకొచ్చినా సరే.. సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే కచ్చితంగా భూసర్వే చేయాలన్నది నిపుణుల మాట. ప్రస్తుతం భూరికార్డులన్నీ అస్తవ్యస్థంగా ఉండడం వల్లే.. ప్రతి గ్రామంలో వందల్లో భూసమస్యలున్నాయి. 9 లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టారు. నిషేదిత జాబితాలోని లక్షలాది ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. 25 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూముల సమస్యలు తీర్చలేకపోతున్నారు. సర్వే చేయని కారణంగానే 10 లక్షలకు పైగా కౌలుదారుల గుర్తింపు జరగడం లేదు. వేల మంది ఆదివాసీలు, గిరిజనులకు పోడుభూముల పట్టాలు దక్కడం లేదు. ప్రస్తుత భూ సమస్యలకు అసలైన పరిష్కారం భూసర్వేనే అనేది ఓ వాదన.

ధరణి విషయంలో జరిగిన అతిపెద్ద మిస్టేక్.. రూల్స్‌ను తయారు చేయకపోవడం. సమగ్రమైన చట్టం తీసుకొచ్చామని చెప్పిన గత ప్రభుత్వం.. ఇప్పటి వరకు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. దాని కారణంగానే ఎన్నో తప్పులు జరిగాయి. ప్రస్తుతం భూభారతి చట్టానికి కూడా ఇంకా రూల్స్‌ ఫ్రేమ్‌ చేయలేదు. కాకపోతే.. మూడే మూడు నెలల్లో రూల్స్‌ తయారుచేస్తామని చెబుతున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

ఆల్రెడీ ధరణి విషయంలో జరిగిన తప్పులను భూభారతిలో సరిదిద్దే ప్రయత్నం జరిగిందంటోంది రేవంత్ ప్రభుత్వం. ధరణి అర్ధంకాక, అందులోని సాంకేతిక సవాళ్ల కారణంగా మధ్యవర్తులపై ఆధారపడాల్సి వచ్చింది. ఫలితంగా సామాన్యులకు ఖర్చులు పెరిగాయి, రైతులను దోపిడీ చేశారు. ధరణి అనేది డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ అయినా సరే.. రిజిస్ట్రేషన్, టైటిల్ డీడ్స్, యాజమాన్య బదిలీల విషయంలో అధికారులకు అడ్డంకులు వచ్చేవి. ముఖ్యంగా ధరణిలో 33 ఆప్షన్స్ ఉండేవి. కాని, ఎన్ని ఆప్షన్స్‌ ఉన్నా చాలా సమస్యలకు పరిష్కారం మాత్రం దొరకలేదు. భూభారతి చట్టంలో 33 ఆప్షన్స్‌ బదులు ఆరు ఆప్షన్స్‌ మాత్రమే తీసుకొచ్చారు. ఇక మాన్యువల్‌గా పహాణీలో 32 కాలమ్స్‌ ఉండేవి. ధరణిలో ఆ 32 కాలమ్స్‌ను ఒకే కాలమ్‌గా చేశారు. ఇప్పుడు దాన్నే 11 కాలమ్స్‌గా చేస్తున్నారు. ధరణి వచ్చాక ప్రైవసీ పేరుతో కొన్ని వివరాలను బయటపెట్టే అవకాశం లేకుండా చేసింది. కాని, భూభారతిలో ఆ అవకాశమే లేదు. ఎవరైనా, ఎక్కడి నుంచైనా భూముల వివరాలు చూసుకోవచ్చు.

ఇక భూభారతిలో ప్రధానమైనది.. భూధార్. ప్రతి ఒక్కరికీ ఆధార్‌ ఎలా ఉందో.. అలా భూధార్ నెంబర్ కూడా ఇవ్వబోతున్నారు. ప్రతి ఒక్క కమతానికి ఒక భూధార్‌ నెంబర్‌ను కేటాయిస్తారు. ఆ నెంబర్‌తో వ్యక్తుల భూములు, వాటి విస్తీర్ణం, క్రయవిక్రయాలన్నీ రికార్డుల్లోకి వస్తాయంటున్నారు. భూభారతి, RoR-2024 చట్టంతో కలిగే ప్రయోజనాలేంటి అని అడిగితే.. భూమి ఉన్న ప్రతి రైతుకు కొత్త చట్టంతో పాస్‌ పుస్తకాలు వస్తాయి. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత వెంటనే మ్యుటేషన్‌ అవడంతో పాటు పాస్‌ పుస్తకం జారీ చేస్తారు. సరిహద్దు వివాదాలు, డబుల్‌ రిజిస్ట్రేషన్లకు అవకాశం లేకుండా పాస్‌ పుస్తకంలో మ్యాప్‌ కూడా ఉంటుంది. అంటే.. మ్యుటేషన్‌కు మ్యాప్‌ని తప్పనిసరి చేశారు. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలోనే రెండు అంచెల అప్పీల్‌ వ్యవస్థ ఉంటుంది. ప్రత్యేకంగా ట్రిబునల్స్‌ కూడా ఏర్పాటు చేస్తారు. పేద రైతులకు ఉచితంగా న్యాయ సహాయం అందించబోతున్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో గ్రామానికో రెవెన్యూ అధికారితో రెవెన్యూ సేవలన్నీ అందుబాటులోకి రానున్నాయి.

ఇకపై డిజిటల్ ల్యాండ్ రికార్డులను సరిదిద్దడానికి ఇందులో అవకాశం ఉంది. ఇదొక్కటి లేకనే లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో పార్ట్-B కింద 18 లక్షల ఎకరాలను చేర్చారు. దీనివల్ల వేల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కేసులపై నిర్ణయం తీసుకునేందుకు కొత్త చట్టంలో వీలు కల్పించారు. భవిష్యత్తులో భూముల రీ-సర్వే జరిగితే.. కొత్త RoR సిద్ధం చేయడానికి వీలుగా నిబంధన చేర్చారు. భూమి విక్రయం, బహుమతి, తనఖా, మార్పిడి, వారసత్వం, సివిల్ లేదా రెవెన్యూ కోర్ట్ ఆర్డర్, లోక్ అదాలత్ అవార్డు, అసైన్‌మెంట్ పట్టా, ఓఆర్సీ, 38ఈ, 13బీ, సేల్ సర్టిఫికేట్‌తో పాటు ఇతర చట్టద్దమైన పద్ధతుల ద్వారా హక్కులను పొందిన యజమానుల హక్కులను కొత్త చట్టంలో నమోదు చేస్తారు. RoR-2020 చట్టంలో వీటికి అవకాశం లేకపోవడంతో ఈ మార్పు తీసుకొచ్చారు. ఉదాహరణకు 13బీ, 38ఈ, ఓఆర్‌సీ, లావుని పట్టా వంటి మార్గాల్లో భూమి వచ్చినప్పుడు.. పాస్‌ పుస్తకాలు పొందే అవకాశం పాత చట్టంలో లేదు. ఇప్పుడు వీరందరికీ పాస్‌ పుస్తకాలు ఇచ్చే అవకాశం కొత్త చట్టం కల్పిస్తోంది. వీటిని ఆర్డీవో లేదా సబ్-కలెక్టర్ విచారించి మ్యుటేషన్ చేస్తారు.

ఇక భూమి అమ్మకం, బహుమతి, తనఖా, మార్పిడి సమయంలో తహశీల్దార్ ఆటో మ్యుటేషన్ చేస్తారు. వీటిలో మోసం జరిగినప్పుడు మ్యుటేషన్‌ను నిలిపివేసే అధికారాలు తహశీల్దార్‌కు ఉంటాయి. వారసత్వం విషయంలో విచారణ జరిపి నిర్దేశించిన సమయంలో మాత్రమే తహశీల్దార్ మ్యుటేషన్ చేస్తారు. ఎందుకంటే.. ధరణిలో ఎలాంటి విచారణ లేకుండానే మ్యుటేషన్ చేసేవారు. దీనికారణంగా కుటుంబాలలో భూవివాదాలు వచ్చాయి. అందుకే, ఈ మార్పు చేశారు. ఇక రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు మినహా ఇతర కేసుల్లో మ్యుటేషన్ చేసే ముందు తప్పనిసరిగా విచారణ జరుగుతుంది. ఆబాది భూములు.. అంటే గ్రామకంఠాలను మున్ముందు RoRలో నమోదు చేస్తారు.

ఈ ఆబాదీ, వ్యవసాయేతర భూములను స్థానిక సంస్థలు మ్యుటేషన్ చేస్తాయి. భవిష్యత్తులో పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్‌కు అదనంగా భూధార్ కార్డ్ కూడా జారీ చేస్తారు. 2014 జూన్‌ 2వ తేదీ లోపు.. అంటే తెలంగాణ ఏర్పాటు ముందు వరకు పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను రెగ్యులరైజ్‌ చేసేందుకు కొత్త చట్టంలో అవకాశం ఏర్పడింది. ఇకపై భూరికార్డుల సవరణ కోసం సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. యాజమాన్య వివాదాలు, పంపకాల కేసుల విషయంలో మాత్రమే సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడుతుంది. RoR ఆధారంగా పహాణిలో నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే.. RoR-2020 చట్టంలో ఉన్నట్టుగా గ్రామ రికార్డులను RoRకు లింక్ చేసే అవకాశం లేదు.

మొత్తానికి, ఈ కొత్త చట్టం తీసుకురావడానికి పెద్ద కసరత్తే జరిపింది ప్రభుత్వం. మేధావులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుంది. బీఆర్ఎస్‌ నుంచి మాజీమంత్రి హరీష్‌రావు, మాజీ ఎంపీ వినోద్‌ అభిప్రాయాలను కూడా తీసుకుని కొత్త చట్టం రూపొందించారు. ఈ కొత్త చట్టం సక్సెస్‌ అవుతుందా లేదా అనేది మరో మూడు నెలల తరువాత.. చట్టం అమల్లోకి వచ్చాక రైతులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగానే ఉంటుంది. సో, వెయిట్‌ అండ్‌ సీ..!

About Kadam

Check Also

కొమురంభీమ్‌ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులి

అమృతగూడ గ్రామం వద్ద గురువారం రోడ్డుపై పులి కనిపించడంతో కలకలం రేగింది. అమృతగూడ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. గ్రామ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *