‘నీ కష్టం ఊరికే పోలేదయ్యా’.. కొడుకు క్రికెట్ కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మెల్‌బోర్న్ టెస్టు మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి చారిత్రాత్మక సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో అతనికి ఇదే తొలి సెంచరీ. అది కూడా భారత జట్టు ఫాలో ఆన్ ప్రమాదం అంచున నిలిచినప్పుడు ఈ సూపర్బ్ సెంచరీ సాధించాడు మన తెలుగబ్బాయ్

పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా! ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్’.. అల్లు అర్జున్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప 2లోని ఈ డైలాగ్ టీమ్ ఇండియా నయా సూపర్ స్టార్‌ నితీశ్ కుమార్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్‌ క్రికెట్ మైదానంలో నితీశ్‌ రెడ్డి రికార్డు సెంచరీ సాధించాడు. దీంతో భారత క్రికెట్ ఆటగాళ్లు, ప్రత్యర్థి ప్లేయర్లు, గ్యాలరీలోని క్రికెట్ అభిమానులందరూ నితీశ్ రెడ్డిని అభినందించారు. అయితే స్టేడియంలోని ఒకాయన మాత్రం ఏడుస్తూ కనిపించాడు. అయితే సరిగ్గా చూస్తే ఆ వ్యక్తి ఆనంద భాష్పాలతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన మరెవరో కాదు నితీష్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి. 21 ఏళ్ల యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని ఆస్ట్రేలియాకు ఎంపిక చేసినప్పుడు, అనుభవం లేని ఈ ఆటగాడు జట్టులోకి ఎందుకు ఎంపికయ్యాడనే ప్రశ్న చాలా మందిలో తలెత్తింది. మాజీ క్రికెటర్లు కూడా ఈ ఆటగాడి స్థానంపై అనుమానాలు లేవనెత్తారు . అదే సమయంలో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లను ఆపడానికి ఆస్ట్రేలియా కూడా ప్రణాళికలు వేసి ఉండవచ్చు. కానీ ఔట్ ఆఫ్ సిలబస్ లా కనిపించాడు నితీష్ రెడ్డి. అయితే తెలుగబ్బాయి ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. ముఖ్యంగా నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి ఎన్నో త్యాగాలు చేశారు.

నితీష్ రెడ్డి చిన్న వయసులోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. అదే సమయంలో కుమారుడిని క్రికెటర్‌గా నిలబెట్టేందుకు అతని తండ్రి ముత్యాల రెడ్డి పెద్ద త్యాగమే చేశారు. ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నారు. నితీష్‌కు 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ముత్యాల రెడ్డి హిందుస్థాన్ జింక్‌లో ఉద్యోగి గా ఉన్నారు. అయితే ఆయనకు విశాఖపట్నం నుంచి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు బదిలీ అయ్యింది. కానీ ముత్యాల రెడ్డి మాత్రం సొంతూరును వదిలిపెట్టి వెళ్లడానికి ఇష్టపడలేదు. ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టి నితీశ్ ను క్రికెటర్ గా చూడాలని నిర్ణయించుకున్నారు. ముత్యాల రెడ్డి ఉద్యోగ విరమణ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయనకు ఇంకా 25 ఏళ్ల సర్వీసు మిగిలి ఉంది.

ప్రభుత్వ ఉద్యోగం మానేసిన ముత్యాల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. తన కుమారుడి క్రికెట్ కోచింగ్ సెషన్స్, క్యాంపులకు ఆయన కూడా తోడు వెళ్లాడు. ఉద్యోగ విరమణ తర్వాత వచ్చిన డబ్బులన్నీ కుమారుడి కోసమే ఖర్చు పెట్టాడు. దీంతో బంధువుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ముత్యాల రెడ్డి మాత్రం వెనకడుగు వేయలేదు. నితీశ్ తల్లి మానస కూడా భర్తకు అండగా నిలిచింది. ఎట్టకేలకు వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. అందుకు నిదర్శనమే మెల్ బోర్న్ స్టేడియంలో ముత్యాల రెడ్డి కన్నీళ్లు.

About Kadam

Check Also

అనుమానంతో కారులో అణువణువు తనిఖీ.. కనిపించింది చూసి ఖాకీలు స్టన్..

ఓ వ్యక్తి కారులో దర్జాగా వస్తున్నాడు.. మనకు తిరుగులేదేలే అంటూ రయ్యిరయ్యిన దూసుకువస్తున్నాడు.. ఈ క్రమంలోనే.. పోలీసులు ఎంటర్ అయ్యారు.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *