టీవీ9 క్రాస్ ఫైర్‌లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీలో తీవ్ర చర్చకు దారి తీశాయి. అంతా కేబినెట్ నిర్ణయం మేరకే అంటూ గులాబీ పార్టీకి అనుకూలంగా మాట్లాడారని కమలం పార్టీలో చర్చ జరుగుతోంది. తన పార్టీ నిబద్ధతను, రాజకీయ ప్రత్యర్థులపై తన వైఖరిని స్పష్టం చేస్తూ.. ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరంపై ఈటల కామెంట్స్ కాకరేపుతున్నాయి. టీవీ9 క్రాస్ ఫైర్‌లో చెప్పిన కొన్ని అంశాలు బీఆర్‌ఎస్‌కు పాజిటివ్‌గా ఉన్నయన్న చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ఉపయోగమేనని అనడం బీజేపీకి ఇబ్బందిగా మారిందన్న డిస్కషన్ నడుస్తోంది. తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయాలను కమిషన్ విచారణలో చెప్పినట్లు ఈటల చెబుతున్నారు. అయితే బీజేపీ నేతగా, బీజేపీ ఎంపీగా పార్టీ స్టాండే తన స్టాండ్ అని.. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ కోరుతున్నట్లు టీవీ9 డిబేట్‌లో స్పష్టం చేశారు ఈటల.
టీవీ9 డిబేట్‌లో ఈటల చేసిన కామెంట్స్‌పై బీజేపీ కీలక నేతలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఓ బీజేపీ ప్రజా ప్రతినిధి ఈటలకు ఫోన్ చేసి.. టీవీ9 డిబేట్‌లో అలా ఎందుకు మాట్లాడారు అని అడిగినట్లు తెలిసింది. అయితే దీనిపై చాలా సున్నితంగా తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు… అప్పటి ప్రభుత్వంలో జరిగిన విషయాలను మాత్రమే చెప్పానని క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. టీవీ9 డిబేట్‌లో కూడా అదే విషయం చెప్పారు. చిన్న నిర్ణయాలు కూడా కేబినెట్ ముందు ఉంచేవారని తెలిపారు.
మరోవైపు కొంత మంది బీజేపీ నేతలు… ఈటల కామెంట్స్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల రాజేందర్ ఇచ్చిన వివరణతో బీజేపీకి సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పినట్లు సమాచారం. కాళేశ్వరం కమిషన్ బీజేపీ వైఖరి ఏమిటని ఈటలను అడగలేదని… ‘‘ఈటల స్టాండ్.. బీజేపీ స్టాండ్ కాదు. ఆయన బీజేపీ ఎంపీగా అక్కడ హాజరుకాలేదు. బీఆర్‌ఎస్‌లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో అదే చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తనకు తెలిసినదేమిటో కమిషన్ ఎదుట చెప్పారని కిషన్ రెడ్డి సదరు నేతలకు చెప్పినట్లు సమాచారం. మొత్తంగా కాళేశ్వరంపై టీవీ9 క్రాస్ ఫైర్‌లో ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ తెలంగాణలో ముఖ్యంగా బీజేపీలో చర్చకు దారితీశాయి.