బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగడంతో వారిలో టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో ఈడీ టార్గెట్ ఏంటీ.? అన్నది ఉత్కంఠగా మారింది.
బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగడంతో సినీ సెలెబ్రిటీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు, యూట్యూబర్స్‌పై ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. తెలంగాణలో బెట్టింగ్ యాప్ బారిన పడి అమాయక ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటుండగా పోలీసులు బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్, యాప్‌లపై కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ చేసినందుకు కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఈడి గుర్తించి ఈసీఐఆర్ నమోదు చేసింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడి దర్యాప్తు చేయనుంది.
ప్రముఖ టాలీవుడ్ నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, అనన్య నాగళ్ల, నిధి అగర్వాల్, మంచు లక్ష్మీ, శ్రీముఖి వంటి వారిపై ఈడీ కేసుని నమోదు చేసి విచారణ చేస్తోంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న 29మంది సెలెబ్రిటీలు, యూట్యూబర్స్ మీద ప్రస్తుతం ఈడీ విచారణ జరపనుంది. గతంలో వీరిపై సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫిర్యాదులు చేశారు. ఇక ఇప్పుడు ఈ కేసు ఆధారంగా ఈడీ వీరికి నోటీసులు ఇచ్చి విచారించనుంది. బెట్టింగ్ యాప్స్ వల్ల యువత పెడదారిన పడుతోంది. బెట్టింగ్‌లో లక్షలకు లక్షలు పోగొట్టుకుని.. చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఇల్లీగల్ బెట్టింగ్, బెట్టింగ్ యాప్‌ల పట్ల ఎంతో బాధ్యత ఉండాల్సిన నటీనటులు సైతం ప్రమోషన్స్ చేస్తూ మరింతగా జనాల్లోకి తీసుకువచ్చారు. ఇలా రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ , మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, రీతూ చౌదరి, శ్రీముఖి, టేస్టీ తేజ, యాంకర్ శ్యామల వంటి వారంతా కూడా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్స్ చేశారు.
ఇలాంటి చట్ట విరుద్దమైన బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసేందుకు వారంతా భారీగానే కమిషన్ తీసుకున్నారు. దీంతో వీరందరిపై సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసుని నమోదు చేసింది. సినీ నటులు, యాంకర్లు, బుల్లితెర తారలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇలా అందరి మీద ఈడీ కన్నేసింది. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, శోబా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణు ప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేషాయని సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ అనే సోషల్ మీడియా ప్రభావం చూపేవారీతో పాటు లోకల్ బాయ్ నాని ఇలా 29 మందిపై ఈడీ కేసు నమోదు చేసింది.
తెలంగాణలో బీఎన్ఎస్ 318 (4), 112, రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్‌లోని 3, 3 (ఎ), 4 సెక్షన్లు, ఐటీ చట్టం 2000,2008లోని 66డి సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మీద పలువురు తారలు స్పందించారు. అవి ఇల్లీగల్ అని తమకు తెలియదని కొందరు.. తమ వల్ల నష్టపోయామని చెప్పిన కొంత మంది ఫాలోవర్లకు వీలైనంతగా వెనక్కి ఇచ్చామని ఇంకొంత మంది తారలు చెప్పారు. ఇలా తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్‌పై ఉక్కుపాదం మోపారు. అయితే ఇలాంటి వీడియోలు ప్రమోటింగ్ చేసినందుకు గాను అనధికారికంగా లెక్కలు చూపకుండా డబ్బును బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుండి భారీగా తీసుకున్నట్లు తెలుస్తుంది . కోట్లాది రూపాయలు చేతులు మారడంతోనే ఈడీ తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. దీనిపై సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫులేన్సర్స్ కి నోటీసులు ఇచ్చి విచారించబోతుంది. ఈడి 13(1),13(2) కింద ఈసీఐఆర్ నమోదు చేసి మనీలాండరింగ్ కోణాల్లో విచారించనుంది.
తమ కేసులు నమోదైన తర్వాత బెట్టింగ్ నిషేధం, బెట్టింగ్ యాప్స్ వాడకండి..అంటూ మళ్లీ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు కొంతమంది సెలెబ్రిటీలు, యూట్యూబర్స్. మరి ఇప్పుడు ఈడీ నమోదు చేసిన కేసు ఎంత వరకు వెళ్తుందో చూడాలి. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు వచ్చిన డబ్బులను ఐటీ రిటర్న్స్‌లో ఎందుకు చూపలేదు..? అనే అంశంతో పాటు అనధికారంగా లావాదేవీలు గుర్తిస్తే మాత్రం ఈడీ సినీ సెలెబ్రెటీలు, యూట్యూబర్లపై చర్యలు తీసుకురని, వారి ఆస్తులు సైతం జప్తు చేసే అవకాశం కనబడుతుంది.