నగరంలో మరో ఆన్‌లైన్ బెట్టింగ్ గ్యాంగ్ గుట్టురట్టైంది. SR నగర్‌లో అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌ను టాస్క్ ఫోర్స్ (సౌత్) టీమ్ సోమవారం అరెస్ట్ చేసింది. నిషేధిత ఖేలో గేమ్స్ బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తున్న ముఠాకు సంబంధించిన ఎనిమిది మందిని అరెస్టు చేసింది. ఈ ముఠా ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం పలు రకాల మొబైల్ అప్లికేషన్‌లను ఉపయోగిస్తోంది. మారు వ్యక్తుల పేర్లతో యూజర్ ఐడీలు, బ్యాంక్ ఖాతాలను సృష్టించి జోరుగా దందా నిర్వహిస్తున్నారు. అరెస్టయిన నిందితులను జి వినయ్ కుమార్, ఎన్ సాయి వర్ధన్ గౌడ్, డి రాహుల్, డి జెశ్వంత్ తేజ, వేణు గోపాల్, కె రామ్, వేల్పుల ఆకాష్, డి ప్రణయ్‌గా గుర్తించారు. మరో ఇద్దరు కీలక నిందితులు కరీంనగర్‌కు చెందిన రాజేష్, అస్లాం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బెట్టింగ్ రాకెట్‌ను నడపడానికి ఈ ముఠా ఏకంగా 235 యూజర్ ఐడీలను జనరేట్ చేసి, కమిషన్ ప్రాతిపదికన యువతను వల్లో వేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. టాస్క్ ఫోర్స్ సౌత్‌జోన్, ఎస్.ఆర్.నగర్ పోలీసుల సంయుక్తంగా చేసిన ఈ దాడిలో నిందితుల నుంచి 18 మొబైల్ ఫోన్లు, 3 బ్యాంక్ పాస్‌బుక్‌లు, 13 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ. రూ. 29,81,000 లక్షల విలువైన ఆన్‌లైన్ లావాదేవీలను స్తంభింపజేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.