అప్పన్నకే మస్కా..! ఉద్యోగుల జేబులోకి హుండీ సొమ్ము వెళ్ళిపోతుంది. కొంతమంది ఉద్యోగులు దేవుడికి శఠగోపం పెట్టి జేబులో నింపుకుంటున్నారు. ఇద్దరు హ్యాండెడ్ గా బుక్ అయిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకీ అప్పన్నకే మస్కా కోట్టి అడ్డంగా బుక్కైన ఇద్దరు ఎవరు..?
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ఇంటి దొంగలు దేవుడికే శఠగోపం పెట్టేందుకు సిద్ధమయ్యారు. హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న సమయంలో ఉద్యోగులు చేతివాటం చూపించారు. ఇద్దరు ఉద్యోగులు కరెన్సీ నోట్లను ఒక్కసారి పట్టించేశారు. 500 నోట్లను తెల్లకాగితంలో చుట్టి బ్యాగులో దాచేశారు.
సింహగిరిపై పరకామణి కేంద్రంలో సోమవారం (సెప్టెంబర్ 1) ఈవో ఆధ్వర్యంలో హుండీలను తెరిచి ఆదాయం లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. దేవస్థానం ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఆదాయం లెక్కింపు ప్రారంభించారు. 28 రోజులకు అప్పన్న హుండీ ఆదాయం 2.06 కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీ రూపంలో హుండి నుంచి సమకూరింది. 174 గ్రాముల బంగారం, 10.33 కిలోల వెండితో పాటు అదనంగా వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా లెక్కించారు. అయితే.. మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో దేవస్థానంలో పనిచేస్తున్న కె. రమణ కొన్ని 500 నోట్లను తెల్లకాగితాల్లో చుట్టి అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లోనే కంప్యూటర్ ఆపరేటర్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి పంచదార్ల సురేష్‌కు అందజేశాడు. అతడు దానిని తన వద్ద ఉన్న హుండీ తాళాలు భద్రపరిచే బ్యాగ్‌లో దాచేశాడు. ఈ మొత్తం వ్యవహారం సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది.
ఎప్పటినుంచి వ్యవహారం సాగిపోతుందో ఏమో గానీ.. ఎట్టకేలకు వాళ్ళ పాపం పండింది. కరెన్సీ నోట్లు దాచుకున్నట్టు సీసీ టీవీ కెమెరాలో కనిపించింది. గమనించిన ఈవో త్రినాధరావు.. విచారణకు ఆదేశించారు. దీంతో ఏఈఓ ప్రత్యేకంగా విచారణ చేశారు. 111 ఐదు వందల రూపాయల నోట్లు ఆ బ్యాగులో బయటపడ్డాయి. ఈ ఘటనలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సురేష్‌ను విధుల నుంచి తప్పించడంతో పాటు పర్మినెంట్ ఉద్యోగి కె.రమణను ఈవో సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. అనంతరం వారిపై గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గోపాలపట్నం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రారంభించారు. కేవలం ఈ ఇద్దరు ఉద్యోగులే ఇలా చేస్తున్నారా లేక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపై ఆరాతీస్తున్నారు. ఈ ఘటన ఒక్క సరిగా సింహాచలం అప్పన్న భక్తులను ఉలిక్కిపడేలా చేసింది.