అందానికి, కళాకారుల నైపుణ్యానికి పేరొందిన ఎలమంచిలి ఏటికొప్పాక లక్కబొమ్మలకూ మరో ఘనత దక్కింది. తన ప్రత్యేకతతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ బొమ్మలు.. మరో అవార్డును సొంతం చేసుకున్నాయి. న్యూఢిల్లీ లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఏటికొప్పాక లక్కబొమ్మలు ఎంపికయ్యాయి. లక్క బొమ్మలకు అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక ప్రసిద్ది.. ఇక్కడ ఈ కళాకారుల చేతుల్లో జీవం పోసుకుంటున్న ఈ లక్క బొమ్మలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఎన్నో అవార్డులు వచ్చాయి. ఈ వృత్తిపైనే ఆ గ్రామస్తులు చాలామంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. బొమ్మలకు ప్రాణం పోసి పొట్ట నింపుకుంటున్నారు అక్కడి కళాకారులు..
ఇటీవల రిపబ్లిక్ డే వేడుకల్లోనూ.. ఏడు కొప్పాక బొమ్మల శకటం సత్తా చాటింది. ఈసారి ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి అవార్డు కు ఎంపికై జిల్లాకు అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లక్క బొమ్మలకు మరో గౌరవం దక్కింది.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్త చేతులు మీదుగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఇప్పటికే.. గుర్తింపు పొందిన ఏటికొప్పాక లక్కబొమ్మలు జాతీయ స్థాయిలో మరో గుర్తింపు పొందాయని కలెక్టర్ పేర్కొన్నారు. అవార్డుతో లక్కబొమ్మల ఖ్యాతి మరింత పెరుగుతుందని తెలిపారు. మన లక్క బొమ్మలకు మరింత ఖ్యాతి రావాలని ఆకాంక్షించారు.