తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ దిల్లీకి చేరింది. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి అంశాలకు సంబంధించి జలశక్తి శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. బనకచర్ల ప్రాజెక్టు వివాదం నేపథ్యంలో ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రులు, అధికారులు హాజరు కావాలని కేంద్ర జలశక్తి శాఖ అధికారులు కోరారు. కృష్ణా, గోదావరి నది జలాల గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర జలశక్తి శాఖ. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల గురించి చర్చించాలనంటుంది తెలంగాణ. వృథాగా సముద్రంలో కలిసే వరద జలాలను వినియోగించుకునేందుకు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు కోరుతుంది ఏపీ. ఈ క్రమంలో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఇవాళ జరిగే సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అయితే నేటి జలశక్తి శాఖ భేటీకి తెలంగాన సీఎం రేవంత్‌రెడ్డి హాజరుపై సస్పెన్స్ నెలకొంది. బనకచర్లపై చర్చకు రాబోమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి లేఖ రాశారు. బనకచర్లపై చర్చే అవసరం లేదంటుంది తెలంగాణ. మిగిలిన జలవివాదాలపై చర్చించాలంటోంది. మీటింగ్ ఎజెండా మారిస్తే హాజరయ్యే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ దగ్గర తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశమై నీటి వివాదాలపై చర్చిస్తారని ముందుగా వార్తలు వచ్చాయి. మీటింగ్‌కు డేట్, టైమ్ కూడా ఫిక్స్ అయింది. కానీ ఈ మీటింగ్‌కు సడెన్ బ్రేక్ వేసింది తెలంగాణ. బనకచర్లపై ఏపీతో చర్చలు జరపబోమని స్పష్టం చేసింది. దీనిపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బనకచర్లపైనే చర్చించాలంటూ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండా సమర్పించిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కృష్ణా, గోదావరి జలాలు సహా అనేక విషయాలపై చర్చించేలా ఎజెండాను పంపింది తెలంగాణ సర్కార్. కృష్ణా నదిపై ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, పాలమూరు, డిండి ప్రాజెక్టులకు జాతీయహోదా, తుమ్మడిహెట్టి దగ్గర నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు, ఇచ్చంపల్లి దగ్గర 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం.. సహా పలు అంశాలతో తెలంగాణ ఎజెండాను పంపించింది. కేవలం బనకచర్ల గురించే అయితే చర్చకు రాబోమంటోంది తెలంగాణ.
బనకచర్లపై GRMB, CWC, ENC అభ్యంతరాలు తెలిపాయి. ఇప్పటివరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవు. చట్టాలు, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదనేది తెలంగాణ వాదన. ఈ ప్రాజెక్ట్‌పై చర్చలకు పిలవడం ద్వారా.. నియంత్రణా సంస్థలు విశ్వసనీయతను కోల్పోతాయని లేఖలో ప్రస్తావించింది.
బనకచర్లపై ఏపీ వాదన మాత్రం మరోలా ఉంది. గోదావరి వరద జలాల వినియోగం కోసమే బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్టు చెబుతోంది. ఏటా 3 వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. వృధాగా పోతున్న నీటి వినియోగం కోసమే ప్రాజెక్టుల నిర్మాణమని వాదిస్తోంది. వరద జలాలను తెలంగాణ వినియోగించుకున్నా అభ్యంతరం లేదంటోంది ఏపీ. ముందు బనకచర్ల పంచాయితీ తేల్చుకుందామని ఏపీ చెప్తోంది. కానీ.. ఇప్పటికే పూర్తైన, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లు, నీటికేటాయింపుల లెక్కలు తేలాకే బనకచర్ల గురించి ఆలోచిద్దామంటోంది తెలంగాణ. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో ఏం జరగబోతుందనేది ఆసక్తిగా మారింది.