ఏపీ మహిళలకు మరో గుడ్ న్యూస్.. ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

స్త్రీ శక్తి పథకం పరిధి మరింత పెరిగింది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ వంటి గ్రౌండ్ బుకింగ్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఆర్టీసీ అనుమతించింది. సింహాచలం ఘాట్ రూట్‌ బస్సుల్లోనూ ఈ పథకం వర్తింపజేసి, టోల్ ఫీజు మినహాయించాలని దేవస్థానానికి లేఖ పంపింది.

ఏపీ సర్కార్ అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకం క్రమంగా మరింత విస్తరిస్తోంది. ఇప్పటివరకు ఎంపిక చేసిన బస్సుల్లోనే ఉచిత ప్రయాణం కల్పిస్తుండగా.. ఇప్పుడు గ్రౌండ్ బుకింగ్ విధానంలో నడిచే బస్సులకు కూడా ఈ పథకం వర్తించేలా ఆర్టీసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని బస్సులను కండక్టర్లు లేకుండా నడుపుతూ.. రెండు–మూడు బస్టాండ్లలో మాత్రమే ఆగే విధంగా ఆర్టీసీ నిర్వహిస్తోంది. ఇలాంటి బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్లు ఆయా బస్టాండ్లలోనే గ్రౌండ్ బుకింగ్ విధానం ద్వారా జారీ చేస్తారు. ఇప్పుడు వీటిలోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు.

ఈ సడలింపు ముఖ్యంగా పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులకు వర్తిస్తుంది. అంటే చిన్న పట్టణాల నుంచి గ్రామాల వరకు నడిచే సాధారణ బస్సుల నుంచి, దూర ప్రయాణాలకు ఉపయోగించే ఎక్స్‌ప్రెస్ బస్సుల దాకా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం లభిస్తోంది.

అంతేకాదు.. సింహాచలం కొండపైకి వెళ్లే సిటీ బస్సుల్లోనూ ‘స్త్రీ శక్తి’ పథకం అమలులోకి వచ్చింది. యాత్రికుల ఇబ్బందులు తలెత్తకుండా ఆ బస్సులకు ఘాట్ టోల్ ఫీజు మినహాయించాలని ఆర్టీసీ అధికారులు దేవస్థానం ఈవోకి లేఖ రాసి ప్రత్యేక అనుమతి కోరారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ఈ పథకం.. విద్యార్థినులు, ఉద్యోగినులు, వృత్తి నిమిత్తం ప్రయాణించే మహిళలకు మరింత సౌలభ్యం కలిగించేలా మారుతోంది.


About Kadam

Check Also

ఈసారి ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరిలోనే.. పరీక్షల విధానంలోనూ కీలక మార్పులు!

2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల విధానంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు యేటా ఇంటర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *