అది ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ. ఓ వ్యక్తి సడెన్‌గా వచ్చాడు. హెడ్ ఆఫీస్ నుంచి చెకింగ్ చేయడానికి వచ్చానని చెప్పడంతో స్టాఫ్ అలర్ట్ అయ్యారు. ఆఫీసులో ఉన్న బంగారమంతా తెచ్చి అతని ముందు పోశారు. ఇదే అదునుగా భావించిన కేటుగాడు ఏం చేశాడంటే..?
ప్రస్తుత కాలంలో మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. నమ్మించి మోసం చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తనిఖీల కోసం వచ్చానని నమ్మించి, ఓ కేటుగాడు రెండున్నర కోట్ల విలువైన బంగారాన్ని చోరీ చేశాడు. సినిమాను తలపించే భారీ మోసం ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడిలో వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఇది తీవ్ర కలకలం రేపింది. చింతలపూడిలోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ సంస్థకు వడ్లమూడి ఉమామహేశ్ అనే వ్యక్తి మంగళవారం ఉదయం 11 గంటలకు వచ్చాడు. తాను విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చానని, ఆకస్మిక తనిఖీ కోసం వచ్చినట్లు బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, క్యాషియర్ ఆశను నమ్మించాడు. దీంతో సిబ్బంది స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న 380 బంగారు ఆభరణాల ప్యాకెట్లను అతని ముందు ఉంచారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ప్యాకెట్‌ను పరిశీలిస్తున్నట్లు నటిస్తూ ఉమామహేశ్ సమయం గడిపాడు. సాయంత్రం 5 గంటల సమయంలో మేనేజర్, క్యాషియర్‌ను కొబ్బరినీళ్లు తీసుకురావాలని బయటకు పంపాడు. వారు తిరిగి వచ్చేసరికి ఉమామహేశ్ కనిపించలేదు. అనుమానంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఉమామహేశ్ నగలన్నింటినీ తన బ్యాగులో పెట్టుకుని వెళ్లిపోయిన దృశ్యాలు కనిపించాయి.
చోరీ అయిన బంగారం విలువ సుమారు రూ. 2.50 కోట్లు ఉంటుందని సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లావ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. నిందితుడు చింతలపూడి బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కి, తెలంగాణ వైపు పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సంఘటన స్థానికంగా ప్రజలను మరియు వ్యాపార సంస్థలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ తరహా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal