అవినీతి అధికారులే వారి టార్గెట్. కరప్షన్ ఆఫీసర్లను పట్టుకోవడం వారి దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయడమే వారి పని. ఇలా చాలమంది ప్రయోగం చేశారు. చాలా వరకు వారి ప్లాన్స్ సక్సెస్ అయ్యాయి కూడా. ఈ క్రమంలో ఓ వీఆర్వోను అదేవిధంగా బెదిరించారు. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో వారి ప్లాన్‌కు ఎండ్ కార్డు పడింది.
తిరుపతి జిల్లాలో నకిలీ ఆఫీసర్స్ ముఠా గుట్టు రట్టయింది. విజిలెన్స్ అధికారులమంటూ రంగంలోకి దిగిన ఫేక్ ఆఫీసర్స్.. కరప్షన్ ఆఫీసర్ టార్గెట్‌గా వ్యూహం పన్నారు. నలుగురు ముఠాగా ఏర్పడి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులను టార్గెట్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎంచుకొని కథ నడిపించే ప్రయత్నం చేశారు. ఏలూరుకు చెందిన కాశి విశ్వేశ్వరయ్య, తిరుపతికి చెందిన నరేంద్ర తోపాటు తెలంగాణకు చెందిన సంతోష్, సంశుద్దీన్‌లు ఫేక్ విజిలెన్స్ అధికారులమంటూ ముఠాగా ఏర్పడి దందా కొనసాగించారు. ఇందులో భాగంగానే గాజుల మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే భూపతి అనే వీఆర్ఓను టార్గెట్ చేశారు. వడమాలపేట మండలం ఎస్వీపురం వీఆర్వోగా పనిచేస్తున్న భూపతిని బ్లాక్ మెయిల్ చేశారు. గాజుల మండలంలోని బాలాజీ నగర్‌లో నివాసం ఉంటున్న భూపతి ఇంటికి వచ్చి హడావుడి చేసిన ముఠా రూ.5 లక్షలు డిమాండ్ చేసింది. అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఏసీబీకి రిపోర్టు పంపబోతున్నామని బెదిరించింది. ఆరెస్ట్ చేస్తున్నామంటూ తుపాకీతో బెదిరించారు.
గత నెల 28న ఉదయం 6గంటలకే భూపతి ఇంటికి చేరుకున్న ముఠా.. అతడిపై బెదరింపులకు పాల్పడింది. వచ్చింది అధికారులని నమ్మిన వీఆర్వో భూపతి ఆరెస్ట్ చేస్తారని భయపడి అడిగినంత డబ్బు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే రూ .5 లక్షలు డిమాండ్ చేసిన గ్యాంగ్‌కు రూ.1.50 లక్షల నగదు ఇచ్చి పంపించాడు. మిగిలిన డబ్బు ఇచ్చేందుకు కొంత సమయం కావాలని కోరాడు. ఆ తర్వాత డబ్బు కోసం ముఠా సభ్యులు పదేపదే ఫోన్లు చేయడంతో భూపతికి అనుమానం వచ్చింది. ఈ మేరకు ఈ నెల 5న గాజులమండ్యం పోలీసులను ఆశ్రయించాడు. భూపతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముఠాపై కన్నేశారు. కదలికలను కనిపెట్టారు. అసలు అధికారులు కాదని ఫేక్ టీంగా గుర్తించి.. తూకివాకం వద్ద నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ 1.26 లక్షల నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.