భారీగా పతనమైన ఉల్లి ధరలు.. రైతు కంట కన్నీరు! ఆదుకోవాలంటూ విన్నపాలు

రాష్ట్రంలో ఉల్లి రైతుల పరిస్థితి దైన్యంగా మారింది. కొనుగోళ్ళు లేక ఉల్లి రైతులు కంటతడి పెడుతున్నారు. అతివృష్టి, అనావృష్టి తో తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి. తీరా పంట చేతికొచ్చాక కొనేవారులేక రోడ్లపైనే పంటతో పడిగాపులు కాస్తున్నారు. ఈ సారి అధిక మొత్తంలో రైతులు ఉల్లి సాగు చేశారు. క్వింటాల్ కనీసం వెయ్యి కూడా ధర రాకపోవడంతో లబోదిబో మంటున్నారు.

రాష్ట్ర వ్యవసాయ రంగంలో కష్టాలన్నీ ఉల్లి రైతులవే అన్నట్లు తయారైంది ప్రస్తుత పరిస్థితి. కష్టపడి పండించడం ఒక ఎత్తు, దాన్ని మార్కెట్‌కు పోయి అమ్ముకోవడం మరో ఎత్తు అన్నట్లుగా ఉంది. మొన్నటి వరకు అధిక ధరలతో ప్రజలకు కన్నీరు తెప్పించిన ఉల్లి.. ఇప్పుడు అమ్ముకునేందుకు రైతును ఏడిపిస్తోంది. ఉల్లి ధర హఠాత్తుగా పడిపోవడంతో ఉల్లి రైతులు లబోదిబోమంటున్నారు.

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలో చాలా మంది రైతులు ఉల్లిని సాగు చేశారు. గత కొన్ని రోజులగా అధిక ధర పలకడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. ఇంతలోపే హఠాత్తుగా ఉల్లి ధర ఒక్కసారి పాతాళానికి పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టపాశం గ్రామంలో ఉన్న రైతులు శ్రీనివాసులు, గోపాల్, సుంకన్న, రైతులు సుమారు ఎకరాకు 70 వేలు పెట్టుబడి పెట్టి ఉల్లి సాగు చేస్తే, ఎకరాకు 25 క్వింటాలు దిగుబడి వచ్చిందన్నారు. ఉల్లిని అమ్మడానికి వెళితే ధర రూ.500 కూడా లేదని, కనీసం రూ.20 వేలు కూడా రావాడం లేదని ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉల్లికి కుళ్లిపోయే గుణం ఎక్కువ. ఎప్పటికప్పుడు గ్రేడింగ్‌ చేయాలి. అలా చేస్తేనే వ్యాపారులు కొనుగోలు చేస్తారు. గ్రేడింగ్‌ చేయించుకోవడానికి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందోని, రోజువారీ వ్యాపారాలు జరగకపోవడంతో తరుగు పేరుతో 5 నుంచి 10 క్వింటాళ్ల సరుకు పారబోయాల్సి వస్తోందన్నారు. గ్రేడింగ్ చేసినందుకు కూలీలకు అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగైదు రోజులైనా ఉల్లి కొనుగోళ్లు జరగకపోవటంతో మార్కెట్‌లో పడిగాపులు కాయడంతోపాటు భోజనాలకు అదనపు ఖర్చులు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, ఉల్లి కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. లేకపోతే తాము అప్పుల పాలవుతామని రైతులు వాపోయారు.

About Kadam

Check Also

బాబోయ్ మళ్లీ వానలు.. రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! అతిభారీ వర్షాలు..

నిన్న, మొన్నటి వరకు వానలు నానాభీభత్సం సృష్టించాయి. ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్న తరుణంలో IMD మరో బాంబ్ పేల్చింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *