తుది దశకు చేరుకున్న ఏపీ బడ్జెట్‌ కసరత్తు.. కీలక శాఖలకు భారీగా కేటాయింపులు.!

ఓ వైపు సూపర్ సిక్స్ వంటి సంక్షేమ పథకాలు.. మరోవైపు అభివృద్ధి ప్రణాళికలు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆ దిశగా బడ్జెట్‌ రూపకల్పనపై కసరత్తు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఆర్థిక మంత్రి కేశవ్‌తో కలిసి దీనికి తుది రూపు దిద్దుతున్నారు.

ఏపీ బడ్జెట్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ బడ్జెట్‌కు ముఖ్య లక్ష్యం రాష్ట్ర GSDP వృద్ధి రేటు 15 శాతం సాధించడం, 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడమే. ఇందుకోసం మూలధన వ్యయాన్ని పెంచుతూ, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తమ పథకాల అమలుకు తగినంత నిధులు కేటాయించడమే కాకుండా, వాటి ఆర్థిక ప్రభావాన్ని సమీక్షించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల అమలుకు పెద్దపీట వేస్తోంది.

సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2.0, సామాజిక భద్రతా పెన్షన్లు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కీలకమైనవి. వీటిలో కొన్నింటిని ఇప్పటికే అమలు చేస్తున్నారు. మరికొన్నింటిని త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు. ఈ హామీల అమలుకు భారీగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నా, సంక్షేమ పథకాలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

రాజధాని అభివృద్ధిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం మూడేళ్లలో రూ.60,000 కోట్ల వ్యయంతో అమరావతిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రూ.30,000 కోట్ల పైగా రుణాలకు హామీ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సందర్భంగా దీనిపై మరింత క్లారిటీ ఇవ్వనుంది. పట్టణ పునరుద్ధరణ ప్రాజెక్టులు, మెరుగైన రహదారి కనెక్టివిటీ, పరిశ్రమల వృద్ధి, పునరుత్పత్తి శక్తి రంగాల్లో పెట్టుబడులు బడ్జెట్‌లో ముఖ్య ప్రాధాన్యత పొందనున్నాయి. ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్, ఐటీ హబ్‌ల అభివృద్ధి, తయారీ పరిశ్రమల వృద్ధి తదితర రంగాల్లో ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకుంటూ, రాష్ట్ర బడ్జెట్‌లో విద్య, ఆరోగ్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పాఠశాలల మౌలిక సదుపాయాల మెరుగుదల, ఉచిత ఆరోగ్య సంరక్షణ పథకాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల బలోపేతం ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఆర్థిక శాఖకు 28 శాఖల బడ్జెట్ సమీక్షలు పూర్తి కావడంతో, మంత్రులంతా తమ శాఖలకు అధిక నిధులు కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ మాత్రమే రూ.37,000 కోట్లు కోరగా, ప్రభుత్వం రూ.27,000 కోట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఈ పూర్తి స్థాయి బడ్జెట్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్థిరపరిచేలా, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, పరిశ్రమల పెట్టుబడులకు సమతుల్యత కల్పించేలా ఉండబోతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

About Kadam

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *